పావలా వడ్డీ పథకం సక్రమంగా అమలుకావడం లేదు : చంద్రబాబు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన శనివారం బీర్కూర్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవున రైతులను, మహిళలను, పశువుల కాపరులను, ఇతరులను కలుసుకుంటూ ఓపికగా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం తిమ్మాపూర్‌లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. కేసిఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చాయని, ఎటొచ్చి తెలంగాణ యువతకే ఉద్యోగాలే లభించడం లేదని విమర్శించారు. పావలా వడ్డీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని ఏ ఉద్దేశ్యంతోనైతే ఈ పథకం చేపట్టారో అది లక్ష్యం సాధించడం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీకే ప్రాధాన్యతనిస్తామని బాబు మరోమారు స్పష్టం చేశారు.వైఎస్‌ఆర్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ సంపాదలను రికవరీ చేస్తే మూడుసార్లు రైతులకు రుణ మాఫీ చేయొచ్చని ఆయన అన్నారు. పాదయాత్రలో భాగంగా ఒకరిద్దరు పశువుల కాపరులను గమనించిన ఆయన వారి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఈ సందర్బంగా పశువుల కాపరులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బాబు దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందని, మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.కుంటి, గుడ్డి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని బాబు భరోసా ఇచ్చారు. అంగవైకల్య శాతాన్ని బట్టి ఫించన్లు అందజేస్తామన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఈ అంశాన్ని అనేక సందర్బాల్లో ప్రస్తావించామన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇది వరకే ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖను అందజేశామన్నారు.తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఇతర పార్టీలు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ప్రత్యారోపణలు చేశారు. బాబు పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, ఏలేటి అన్నపూర్ణ, హన్మంత్‌షిండే, టిడిపి జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కులాచారి దినేష్‌కుమార్‌, బిసిసెల్‌ నాయకుడు కుంచాల రాజు, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మోహన్‌రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జీ బద్యానాయక్‌, రాష్ట్ర నాయకురాలు అట్లూరి రమాదేవి, కత్తెర గంగాధర్‌ తదితరులు ఉన్నారు.