పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో ముందున్న తెలంగాణ

వరుసగా మూడోమారు అవార్డు అందున్న డిజిపి
న్యూఢిల్లీ,జూన్‌26(జ‌నం సాక్షి): దేశంలోనే నెంబన్‌ వన్‌గా ఉన్న తెలంగాణ పోలీసు శాఖకు.. మరో జాతీయ అవార్డు దక్కింది. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో వరుసగా మూడోసారి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పాస్‌ పోర్ట్‌ వెరిఫికేషన్‌, పాస్‌పోర్ట్‌ జారీలో అత్యుత్తమ సేవలందిస్తున్న రాష్ట్రానికి  కేంద్ర విదేశాంగ శాఖ అవార్డు ఇచ్చింది. పాస్‌పోర్ట్‌ దివస్‌ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేతులవిూదుగా డీజీపీ మహేందర్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కేవలం నాలుగు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ పక్రియ ముగిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పౌరులు సులభంగా పాస్‌పోర్టు పొందేలా సేవలందిస్తున్నామని చెప్పారు. ఈ క్రెడిట్‌ అంతా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు సిబ్బందికే చెందుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక సహకారంతోనే పోలీస్‌ శాఖ ఉన్నత విజయాలు సాధిస్తోందన్నారు. ఇతర రాష్టాల్రు తొమ్మిది రోజుల్లో వెరిఫికేషన్‌ చేస్తూ తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని డీజీపీ వెల్లడించారు. దేశంలో పాస్‌పోర్ట్‌ల జారీ పక్రియ, వెరిఫికేషన్‌ పక్రియలో తెలంగాణ పోలీస్‌ శాఖ తొలిస్థానంలో నిలవటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్‌ కు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి మొదలయ్యే పక్రియను సంబంధిత వ్యక్తులకు టైం టూ టైం సమాచారాన్ని అందిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అపాయింట్‌మెంట్‌ తీసుకొని వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వెరిఫికేషన్‌ యాప్‌ ద్వారా మూడేళ్లుగా పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ లో విజయాలు సాధిస్తున్నామని తెలిపారు. తొలి సంవత్సరం 5 రోజుల్లో వెరిఫికేషన్‌ పక్రియ ముగించి తొలి స్థానంలో నిలిస్తే.. రెండో సంవత్సరం మన రికార్డును మనమే బ్రేక్‌ చేసి కేవలం 4 రోజుల్లో పాస్‌పోర్ట్‌ పక్రియను పూర్తి చేస్తూ మళ్లీ ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. దేశంలోని సివిల్‌ కోర్టులలోని కేసుల సమాచారంతో పాటు.. వివిధ కేసుల సమాచారాన్ని సేకరిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయితే.. మూడేళ్లుగా పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.