పీఎన్‌బీ స్కాంలో కీలక పరిణామం

– తొలిచార్జ్‌ షీట్‌ను దాఖలు చేసిన సీబీఐ 
 – నీరవ్‌ మోదీ ‘వాంటెడ్‌’ నిందితుడుగా పేర్కొన్న సీబీఐ
ముంబయి, మే14(జ‌నం సాక్షి) : దేశ బ్యాంకింగ్‌ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) రూ.13,400కోట్ల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ముంబయిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ ఛోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు బ్యాంకు మాజీ చీఫ్‌ ఉషా అనంతసుబ్రమణియన్‌తో (ప్రస్తుతం అలహాబాద్‌ బ్యాంకు సీఈవో, ఎండీగా ఉన్నారు) పాటు మరికొందరు ఉన్నతాధికారుల పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఛార్జ్‌ షీట్‌లో నీరవ్‌ను ‘వాంటెడ్‌’గా పేర్కొంది. 2015 నుంచి 2017 వరకు ఉషా పీఎన్‌బీకి ఎండీ, సీఈవోగా ఉన్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసులో ఉషను సీబీఐ ప్రశ్నించింది. ఇక ఆమెతో పాటు పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్‌ శరణ్‌, జనరల్‌ మేనేజర్‌ నేహాల్‌ అహద్‌ పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. ఈ వ్యవహారంలో నీరవ్‌మోదీ, ఆయన సోదరుడు నిశాల్‌, నీరవ్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ సుభాశ్‌ పరబ్‌ పాత్రలను కూడా సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వివరించింది. ఏడాది మార్చిలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే స్కాం బయటపడటానికి చాలా రోజుల ముందే ప్రధాన నిందితులైన నీరవ్‌ మోదీ, ఛోక్సీలు దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్‌ న్యూయార్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కుంభకోణంలో ఇప్పటివరకు 20 మంది పీఎన్‌బీ ఉద్యోగులను అరెస్టు చేశారు. అటు పీఎన్‌బీ కూడా అంతర్గత దర్యాప్తు చేపట్టి 21 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసింది.