పుండుమీద కారం జల్లితే ఊర్కోం
ఔను! అది అరవై ఏళ్ల మానని పుండే. ఆంధ్రరాష్ట్ర అవతరణ తెలంగాణ ప్రజల పాలిట శాపం. ఆ రోజును తెలంగాణ ప్రజలు దుర్దినంగా భావిస్తూ అవతరణ వేడుకలను బహిష్కరిస్తూ నల్లజెండాలతో నిరసనలు తెలుపుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగి అరవై ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ అది తెలంగాణ పాలిట మానని పుండే. ఆ పుండు మీద కారం జల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటో తేదీనాటికి ఆంధ్రరాష్ట్రం ఏర్పడి అరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడుగుతుంటే సర్కార్ వజ్రోత్సవాల నిర్వహణకు పూనుకోవడం ముమ్మాటికీ అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వజ్రోత్సవాలు నిర్వహించడం దుస్సహాసమే అవుతుంది. ఒక వైపు ప్రత్యేక తెలంగాణ, మరో వైపు సమైక్యాంధ్ర ఉద్యమాల ప్రభావం ఈ వజ్రోత్సవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. కనుక ఈ ఉత్సవాలు కళావిహీనం కాక తప్పదు.
స్వాతంత్య్రానంతరం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953 అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్రరాష్ట్రం ఏర్పడగా, 2013లో అరవై ఏళ్లు పూర్తవుతాయి. ఈ తరుణంలో వజ్రోత్సవాల ప్రతిపాదనకు తెలంగాణ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి 1956 నవంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. విలీనమైపోయిన ఆంధ్రరాష్ట్రానికి 60 ఏళ్లు నిండితే నిండనియ్. మనకెందుకు?