రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపు

జనవరి10 (జనం సాక్షి):కొత్త సినిమా విడుదల అయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు మెమోలను జారీ చేస్తున్న తీరును హైకోర్టు ఎండగట్టింది. కొత్త సినిమా వస్తే టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించే విధానం ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదని తేల్చి చెప్పింది. ప్రతిసారి చివరి క్షణంలో, అదీ కోర్టుకు సెలవుల ముందు టికెట్ల ధరల పెంపునకు ఉత్తర్వులు జారీ చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నిసార్లు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ తీరు మారడం లేదని మండిపడింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. టికెట్ ధరలను పెంచేందుకు చట్ట ప్రకారం ఉన్న అవకాశాలకు తిలోదకాలిచ్చి, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రతి సినిమాకు ధరల పెంపునకు మెమోలను జారీ చేయడమేంటో అర్థం కావడం లేదని ఆక్షేపించింది. కోర్టు ఉత్తర్వులంటే లెక లేకపోతే ఎలా అని ప్రశ్నించింది.
మెమోల రూపంలో పెంచితే ఎలా?
టికెట్ల రేట్లను పెంచాలనుకుంటే నిబంధనల ప్రకారం చేసుకోవచ్చని హైకోర్టు చెప్పింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా మెమోల రూపంలో టికెట్ ధరలను పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ తరహా మెమోలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అంతేగాకుండా జీవో 120 ప్రకారం టికెట్ ధరలను నిర్ణయించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ద్విసభ ధర్మాసనం ఒక ప్రజాహిత వ్యాజ్యంలో వెలువడిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కూడా అమలు చేయాల్సిందేనని పేరొన్నది. జీవో 120పై సీజే ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను విభేదిస్తే సమీక్ష చేయాలని కోరడమో లేక సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడమో చేయాలన్న నిబంధనలను గుర్తుచేసింది. ఒక జీవో (120) అమల్లో ఉండగా మెమోలతో ధరలను పెంపునకు వీల్లేదంది. ధరల పెంపు చేయాల్సివస్తే ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసుకోవచ్చునని సూచన చేసింది. కొత్త జీవో వెలువరించిన తర్వాత టికెట్ ధరలను ఇష్టానుసారం పెంచితే ఎవరికీ అభ్యంతర ఉండదని అభిప్రాయపడింది.
సాధారణ ధరలే అమలు చేయండి
‘ది రాజా సాబ్’ సినిమా టికెట్ ధరలను ఈ నెల 18వ తేదీ వరకు వారం రోజులపాటు పెంచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. శుక్రవారం ప్రదర్శించే ఆటలకు పెంచిన ధరలను కొనసాగించాలని, శనివారం నుంచి ప్రదర్శించే షోలకు సాధారణ టికెట్ ధరలనే అమలు చేయాలని తెలిపింది. తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు మెమో సస్పెన్షన్ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు టికెట్ ధరల పెంపునకు ఏవిధమైన మెమోలు జారీ చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేరొన్నది.
ఈ మేరకు శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ఆదేశాలను జారీ చేశారు. రాజాసాబ్ సినిమా టికెట్ల ధరలను జనవరి 18వరకు పెంపుదలకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌లో.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం మెమోలు చేయడం జారీ ద్వారా కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సినిమా టికెట్ల ధరలను పెంపునకు అనుమతిస్తున్నదని చెప్పారు. భారీ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారే గానీ, ఇందుకు చెందిన ఆడిట్ రిపోర్టులను చూపడం లేదని పేర్కొన్నారు.
మంత్రి ప్రకటించాక మెమోల జారీ ఎలా?
రాజాసాబ్ నిర్మాతలు, బుక్ మై షో తరపు న్యాయవాదులు ప్రతివాదన చేస్తూ భారీ బడ్జెట్‌తో సినిమాల చిత్రీకరణ చేస్తే టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వ అనుమతి పొందినట్టు చెప్పారు. మూడు లక్షల టికెట్లు విక్రయించినట్టు చెప్పారు. ఈ మొత్తం వాపస్ ఇవ్వడానికి సమస్యలు కూడా వస్తాయని తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లను ధ్వంసం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు ఉండబోదని మంత్రి ప్రకటించినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయని గుర్తుచేసింది. సాక్షాత్తు మంత్రి ప్రకటించిన తర్వాత కూడా ధరల పెంపు మెమోలు ఎలా జారీ అవుతున్నాయని ప్రశ్నించింది.
నాలుగైదు సినిమాల టికెట్ ధరలను పెంపునకు ఇచ్చిన ఉత్తర్వులను వ్యూహాత్మకంగా జారీ చేసినట్టు అనిపిస్తున్నదని చెప్పింది. సినిమా విడుదలయ్యే చివరి నిమిషంలో లేదా కోర్టు సెలవులకు ముందు మెమో జారీ చేశారని తప్పుపట్టింది. ఇప్పుడు వెలువడిన మెమో కూడా హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ రూల్స్‌కు వ్యతిరేకమని పేర్కొన్నది. ‘రాజాసాబ్ ’ టికెట్ ధరల పెంపునకు హోంశాఖ ఇచ్చిన మెమోను శనివారం 10వ తేదీ నుంచి అమలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఇకపై విడుదల కాబోయే కొత్త సినిమా టికెట్ల ధరల పెంపునకు మెమోలను జారీ చేయడానికి వీల్లేదని కూడా ఆదేశించింది.



