పోరాడే విద్యార్థులకు అండగా ఉంటాం

జనవరి9 (జనం సాక్షి):రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ఉన్నది. సీరియల్ కిల్లర్స్‌లాగా కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్‌గా మారారు’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాలు, త్యాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటాన్ని సహించబోమని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందినగర్‌లో ఉన్న తన నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) విద్యార్థులతో కేటీఆర్ శుక్రవారం సమావేశమయ్యారు. 50 ఎకరాల వర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవడంపై విద్యార్థులు కేటీఆర్‌తో చర్చించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడుకొనే విషయంలో విద్యార్థులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అవసరమైతే విద్యార్థులతోపాటు ఢిల్లీలో ధర్నాకు దిగుతామని, పార్లమెంట్‌లోనూ ఇదే అంశంపై చర్చిస్తామని భరోసా ఇచ్చారు. హైకోర్టు పేరుతో గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల భూమిని తీసుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. హెచ్‌సీయూలో కూడా 400 ఎకరాల భూమిని గుంజుకొనే ప్రయత్నం చేయగా, విద్యార్థుల ఆందోళనతోపాటు సుప్రీంకోర్టు జోక్యంతో అది తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని అమ్ముకొనేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) యాజమాన్యానికీ నోటీస్ ఇచ్చారని, వారి నుంచి కూడా 100 ఎకరాలు లాకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూమి లాక్కోవడంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని నిర్ధారణ అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్య తీసుకొని ఉంటే ఇవాళ ఉర్దూ వర్సిటీ భూముల కబ్జాపర్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టేది కాదని స్పష్టంచేశారు.
రాహుల్ జీ.. ఇదేనా మొహబ్బత్‌కీ దుకాణ్?
దేశంలో మైనారిటీల సంరక్షకుడిని అని చెప్పుకొనే రాహుల్‌గాంధీ ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే వారిని కాపాడటమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనారిటీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమే మీ సంరక్షణా? మొహబ్బత్‌కీ దుకాణ్ అని చెప్తున్నది ఇదేనా? వర్సిటీ భూములను గుంజుకొని విద్యార్థులను రోడ్డుపై వేయడమేనా? రాహుల్‌గాంధీ దీనికి సమాధానం చెప్పు?’ అని నిలదీశారు. తెలంగాణలో తొలిదశ ఉద్యమం వల్లే హైదరాబాద్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాలు, త్యాగాల ఆధారంగా ఏర్పడిన ఈ యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటాన్ని సహించబోమని హెచ్చరించారు.



