పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయడం అభినందనీయం : జగదీశ్వర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్‌22 జనం సాక్షి  తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించిన సుమధుర ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామంలో సుమధుర ఫౌండేషన్‌ ట్రస్టీ గుండా మధుసూదన్‌ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన ఆత్యాధునిక ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. పుట్టిన ఊరు, కన్నతల్లిని మరచిపోకూడదనే పెద్దల మాటలను మధుసూదన్‌ కుటుంబ సభ్యులు నిజం చేశారన్నారు.  కన్నతల్లితో సమానమైన సొంత గ్రామంతో అనుబంధం పేగు బంధం లాంటిదన్న మంత్రి, అలాంటి సొంత ఊరిపై ఉన్న మమకారంతో ధనార్జనే ముఖ్యం కాదని నిరూపించారని ప్రశంసించారు. సొంత గ్రామ అభివృద్ధే లక్ష్యంగా భావించి సేవా కార్యక్రమాలు చేస్తున్న సుమధుర ఫౌండేషన్‌ సభ్యులు అందరికీ ఆదర్శం అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అంన్నిర్రంగాల్లో నబర్‌వన్‌ గా నిలిచిందన్నారు. ఒకప్పుడు ఆకలి కేకలతో అల్లాడిపోయిన తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి తోడుగా, మేము సైతం అంటూ సుమధుర ఫౌండేషన్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. పుట్టిన ఊరుకు మంచి చేయాలనే ఆలోచనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండి ,సామాజిక కార్యక్రమాలు నిర్వహించి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.