పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

హైదరాబాద్‌, జూలై 5 : రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికార పార్టీ నిర్ణయించకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ మాత్రం తమ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు  ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ఇటీవలి ఉప ఎన్నికల్లో పార్టీ దెబ్బతిన్న నేపథ్యంలో, నిస్పృహలో పడిపోయిన పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు గ్రామ పంచాయతీ  ఎన్నికలు వీలైనంత వేగంగా జరిపించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఉప ఎన్నికల్లో  పార్టీ మెరుగైన ఫలితాలు చూపలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు మంత్రులతో ఏర్పాటైన కాంగ్రెస్‌ కమిటీ తన మూడో సమావేశాన్ని హైదరాబాద్‌లో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో నిర్వహించింది. రెడ్లు, ఎస్సీలు, ఎస్టీల్లాంటి సంప్రదాయక ఓటర్లు కాంగ్రెస్‌కు దూరమవడానికి దారితీసిన కారణాలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ప్రతి గ్రామంలో వివిధ వర్గాల ఓటర్ల వివరాలను కులం, మతం ప్రాతిపదికన సేకరించాలని కమిటీ నిర్ణయించింది. ‘ఆయా వర్గాల కోసం సంక్షేమ పథకాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు ఈ వివరాలను మేం ఉపయోగించుకుంటాం’ అని ఆనం తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాల్లో లోపాలను సరిదిద్దడంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరాలను కమిటీ నొక్కి చెప్పినట్టు  ఆయన వివరించారు. అలాగే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి  ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం జరపాల్సి ఉందని కూడా కమిటీ అభిప్రాయపడింది. అలాగే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేందుకు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి ఉందని కూడా కమిటీ పేర్కొంది. కమిటీ సభ్యుడు కానప్పటికీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. అక్రమ లబ్ధిదారులను అరికట్టేందుకు, ఇళ్లు కేటాయించిన ఇరవయ్యేళ్ల తర్వాత మాత్రమే యాజమాన్యాన్ని లబ్ధిదారునికి బదలాయించే విధంగా తమిళనాడులో అమలు చేస్తున్న విధానం మాదిరిగా మన రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాన్ని సవరించాల్సి ఉందని ఆయన ప్రతిపాదించారు. కమిటీ తిరిగి ఈ నెల 9న  సమావేశం కానుంది. కొత్త సంక్షేమ పథకాలపై చర్చించేందుకు ఈ సమావేశానికి సంక్షేమ మంత్రులను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.