పూటకోమాట ! తెలంగాణపై ‘నెల’ తప్పిన కాంగ్రెస్‌ను సడక్‌ బంద్‌తో సత్తాచాటుదాం : కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) :
పూటకోమాట చెప్తూ తెలంగాణపై నెల తప్పిన కాంగ్రెస్‌ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి సడక్‌బంద్‌తో ఈ ప్రాంత ప్రజల సత్తా చాటు తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. సడక్‌బంద్‌ విజయవంతం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలకు తలొగ్గిన కేంద్ర హోం మంత్రి షిండే ఇతర రాష్ట్రాల డిమాండును కొత్తగా తెరపైకి తెచ్చారని అన్నారు. రోగం ఉన్న వారికే మందు వేయాలి గాని.. అందర్నీ ఒకే గాటన కట్టడం మంచి పద్ధతి కాదన్నారు. 2004 నుంచి నాన్చుతూ వస్తున్న కాంగ్రెస్‌ పార్టీయే ఆత్మబలిదానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మరికొంత కాలం నాన్చేందుకే షిండే అలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇతర రాష్ట్రాల డిమాండు తెరపైకి వస్తుందన్నది వట్టి మాటేనన్నారు. తెలంగాణ తెచ్చుకునేంతవరకు తమ పోరాటం సాగుతునే ఉంటుందన్నారు. ఈనెల 24న నిర్వహించనున్న సడక్‌ బంద్‌కు అన్ని పార్టీల వారు కదలి రావాలని కోరుతున్నామన్నారు. దీనిని విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఆకాంక్షపై ఢిల్లీ దిమ్మదిరిగేలా తరలివచ్చి సడక్‌ బంద్‌ విజయవంతం చేయాలని కోరారు. జేఏసీ బస్సుయాత్ర సాయంత్రం ఆలంపూరు వద్ద ముగిసింది. యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇంకా అధిష్టానానికి విధేయత ప్రకటించడం వారి బాసిన మనస్తత్వాలకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరెట్ల పదవుల్లో కొనసాగుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం ప్రజల ఆకాంక్షలపై సత్వర నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.