పూర్తిస్థాయి ఉద్యోగ నోటికేషన్లు విడుదల చేయాలి
తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు పూర్తి స్థాయి ఉద్యోగ నోటికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని తెలంగాణ యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు.బుధవారం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ నందు ఏఓ శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, తమ సమస్యల పరిష్కారం కొరకు ఆశగా ఏదురుచూస్తున్నారని అన్నారు.గ్రూప్ 2 , జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, టీఆర్టీ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.2018 సాధారణ ఎన్నికలలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలన్నారు.అగ్నిపథ్ వ్యతిరేక ఉద్యమంలో రైల్వే కేసులు నమోదైన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయ సహాయం అందించాలని, కేంద్రంతో మాట్లాడి కేసుల ఉపసంహరణకు కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను వివిధ శాఖలలో సర్దుబాటు చేసే ఆలోచన మాని, వెంటనే గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన సమితి జిల్లా నాయకులు యాకూబ్ రెడ్డి , సుమన్ నాయక్ , గోపి, నవీన్ , సందీప్ తదితరులు పాల్గొన్నారు