పెండింగ్‌ రహదారులకు నిధులివ్వండి

– కేంద్ర మంత్రి గడ్కరీనికోరిన రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి

– గడ్కరీతో భేటీ అయిన జగదీష్‌రెడ్డి, తెరాస ఎంపీలు

– సీఎం కేసీఆర్‌ రాసిన వినతిపత్రాలను అందజేత

న్యూఢిల్లీ, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని, నూతన రహదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరినట్లు రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నమంత్రి జగదీష్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలతో కలిసి నితిన్‌ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా నేతలు రాష్టాన్రికి సంబంధించిన అంశాలపై గడ్కరీతో చర్చించారు. అనంతరం మంత్రి జగదీష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు… రాష్ట్రంలో పెండింగ్‌ రహదారుల అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. సీఎం కేసీఆర్‌ రాసిన వినతి పత్రాలను కేంద్రమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గతంలో రాష్టాన్రికి 3,150కిలోవిూటర్ల రహదారులు మంజూరు చేశారన్నారు. వీటిలో 680కిలోవిూటర్లకు గుర్తింపు సంఖ్య ఇవ్వలేదని వీటికి గుర్తింపు సంఖ్యలను ఇవ్వాల్సిందిగా కోరటం జరిగిందని మంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారులు సాడయ్యాయని, వీటి మరమ్మతులు త్వరితగతిన చేయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా వరంగల్‌ – భూపాలపల్లి రహదారిలో రెండు అండర్‌ పాస్‌లు.. ఆలేరు – నియోజకవర్గంలో రెండు అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించామన్నారు. కోదాడ-మిర్యాలగూడ మార్గంలో కొన్ని గ్రామాల రూట్లను కలపాల్సిందిగా కోరామన్నారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌రోడ్డు విషయాన్ని మరోసారి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వెల్లడించారు.