పెద్దపల్లిలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల జోరు ప్రచారం
ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్న నేతలు
మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని హావిూ
పెద్దపల్లి,నవంబర్24(జనంసాక్షి): పెద్దపల్లిలో ఉన్న మూడు నియోజకవర్గాల టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో బిజీబిజీగా దూసుకునిపోతున్నారు. గ్రామాలను వదలకుండా ప్రచారాన్ని సాగిన్నారు. సోమారపు సత్యనారాయణ, పుట్టా మధుకర్, దాసరి మనోహర్‌లు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. పెద్దపల్లి
జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతున్నదని, బంపర్ మె జార్టీతో జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సీట్లు కైవసం చేసుకొని, కూటమి కోటలను బద్దలు కొడతామని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పునరుద్ఘాటించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తిరిగి టీఆర్‌ఎస్‌కు పట్టం కడతాయన్నారు. పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు నియోజకవర్గాల్లో చేసిన ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన వస్తుందన్నారు. మహాకూటమికి ఓటేస్తే సీమాంధ్ర నాయకులకు వేసినట్లేననీ, టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ సింగరేణి కార్మికుల ఓట్లపై ప్రధానంగా దృష్టి సారించారు. కార్మికులంటే కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ అనీ, అందుకే నాలుగేళ్ల కాలంలో అనేక హావిూలను నెరవేర్చారన్నారు. మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మరింత మేలు జరుగుతుందనీ, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కాగా, సోమారపునకు మద్దతుగా పెద్దపల్లి, జగిత్యాల మహిళా, స్త్రీ శిశు సంక్షేమ రెండు జిల్లాల ఆర్గనైజర్ మూల విజయా రెడ్డి గోదావరిఖనిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మరోసారి ఆశీర్వదించి పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మారుమూల గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానని పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్ చెప్పారు. గొల్ల, కుర్మల అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితికి రాష్ట్రంలోని గొల్ల, కుర్మలంతా మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు. ఇది తమ బాధ్యతగా, కర్తవ్యంగా గొల్ల, కుర్మలు భావించి డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తమ సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. మంథనిలో పుట్ట మధును గెలిపించడంతో పాటు కేసీఆర్‌ను మరో మారు ముఖ్యమంత్రిగా చేసుకుందా మన్నారు. మహాకూటమి పేరుతో ముఠాగా ఏర్పడిన పార్టీలు ప్రజల విశ్వసనీయతను సంపాదించలేవన్నారు. మహాకూటమిలో ఉన్న పార్టీలు 70 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పేదరికంలోకి నెట్టివేశాయని ఘాటుగా విమర్శించారు. రైతుల ఆర్థికాభివృద్ధి కోసం మిషన్‌కాకతీయతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు రానున్న రోజుల్లో రైతులను రాజులను చేస్తుందనడంలో సందేహం లేదన్నారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. పెద్దపల్లి పట్టణానికి గత పాలకులు కనీసం మంచినీళ్లు కూడా ఇప్పించలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి ఎస్సారెస్పీ నుంచి నీటిని మళ్లించి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. పట్టణంలో అంతర్గతరోడ్లతో పాటు నూతన డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేశారన్నారు. అలాగే రామగుండం నియోజకవర్గ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేయించారన్నారు. మంథని నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో పుట్ట మధు పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథం వైపు నడిపించారన్నారు.