పెద్ద రైతులు ఆయిల్ పామ్ వైపు మళ్ళాలే!

నంగునూరు మండలం జెపి తండాలోని  పెద్ద రైతులందరూ ఆయిల్ పామ్ వైపు మళ్ళాలని గ్రామ సర్పంచ్ బిక్షపతి నాయక్ సూచించారు. సిద్దిపేట జిల్లాలోని ప్రతి గ్రామంలో పామాయిల్ తోటలు జోరుగా పెంచేలా మంత్రి హరీష్ రావు నిరంతరం రైతులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్థాయిలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఆర్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించిన నేపథ్యంలో గ్రామ గ్రామాన రైతులకు పామాయిల్ పంటల పట్ల అవగాహన కలిగేలా కరపత్రాలను అందజేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రోజు జేపీ తండా గ్రామంలో ప్రతి రైతుకు పామాయిల్ పంట సాగు విధానం, ఖర్చులు లాభాలకు సంబంధించిన కరపత్రాలను రైతులకు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ… ఎస్టీలకు ప్రభుత్వం 100% సబ్సిడీ ఇస్తున్నందున తండావాసులంతా ఈ పంట సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  పామాయిల్ మొక్కలు నాటిన రెండు సంవత్సరాల నుంచి ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగంల జీతం వస్తుందని నెలనెలా రైతుల జేబులో డబ్బులు ఉంటాయని పేర్కొన్నారు. మండల పామాయిల్ ఇన్చార్జ్ శ్రీకర్ రెడ్డి, వార్డు మెంబర్లు, రైతులు, ఎస్టీ మహిళలు తదితరులు ఉన్నారు.