పెరిగిన పసిడి డిమాండ్

putg1slsబంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా సెంటిమెంట్ ఆశావాహంగా, ప్రభుత్వ పాలసీ నిర్ణయాలు అనుకూలంగా ఉండటంతో జనవరి-మార్చి మధ్యకాలంలో డిమాండ్ 15 శాతం పెరిగి 191.7 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో భారత్‌లోకి 167.1 టన్నుల పసిడి వచ్చి చేరిందని 2015 తొలి త్రైమాసికం గోల్డ్ డిమాండ్ ట్రెండ్ పేరుతో నివేదికను వెల్లడించింది.

విలువ పరంగా చూస్తే 9 శాతం పెరిగి రూ.46,730.6 కోట్లకు ఎగబాకింది. సరాసరిగా ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్న పసిడి దిగుమతులు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 15 శాతం పెరిగాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. గతేడాది ఇదే సమయంలో పసిడి దిగుమతులపై ఆంక్షలు విధించడంతోపాటు దేశ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటంతో డిమాండ్ అంతకంతకు పడిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా అకాల వర్షాలు కురియడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో ఈ ఏడాది డిమాండ్ 900-1000 టన్నుల స్థాయిలో ఉండనున్నదని ఆయన అంచనావేస్తున్నారు. తొలి త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 22 శాతం ఎగబాకి 150.8 టన్నులకు చేరుకుంది. వీటి నికర విలువ రూ.36,761.4 కోట్ల స్థాయిలో ఉంది. పసిడిపై పెట్టుబడులు 6 శాతం తగ్గి 40.9 టన్నులకు పరిమితమైనట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది.