పెళ్లిపేరుతో మోసం

యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఆగ్రా,జూన్‌25(జ‌నం సాక్షి ): పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన ఓ యువకుడిని యూపిలో అరెస్ట్‌ చేశారు. అంతేగాకుండా అతను మరో యువతితో వివాహం నిశ్చయించుకుని వాట్సప్‌ ద్వారా పెల్లి కార్డు కూడా పంపాడు. ఇలా యువతిని వేధింపులకు గురిచేస్తున్న ఒక యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన మహ్‌రైలీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడు ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఆ యువకుడు తన బంధువులతో పాటు పెళ్లికి ఊరేగింపుగా వెళ్లే సన్నాహాల్లో ఉన్నాడు. అక్కడే అతన్ని అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు అరవింద్‌ తన పెళ్లి కార్డును గర్ల్‌ఫ్రెండ్‌కు వాట్సప్‌ ద్వారా పంపించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అరవింద్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి మోసం చేశాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.