పేదింటి ఆడబిడ్డకు మేనమామ కే.సి.ఆర్ రాష్ట్ర మంత్రి గంగుల
పేదింటి ఆడబిడ్డకు మేనమామగా ముఖ్యమంత్రి కే.సి.ఆర్. అండదండలు అందిస్తున్నాడని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి అంటే ఒకప్పుడు తల్లిదండ్రులు ఎంతో భయపడే వారని, ఇల్లు కట్టి చూడు, ఆడపిల్ల పెళ్లి చేసి చూడు అన్నట్లు ఉండేదని కానీ, ఆ భయం లేకుండా ముఖ్యమంత్రి కే.సి.ఆర్. మేనమామగా కళ్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేసి పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటుందని తెలిపారు. పేద ఇంటి ఆడపడుచులు తమ బిడ్డల పెండ్లికి ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఒక లక్ష 116/- రూపాయలు అందజేస్తున్నారని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.