పైసల కోసం కాదు.. ప్రజా శ్రేయస్సే ప్రధానం
– మాంసానికి.. మందుకు ప్రలోభపడవద్దు
– మాయమాటలతో ఓటర్లను మభ్యపెడుతున్న నాయకులు
– బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్
గోదావరిఖని, నవంబర్ 25, (జనంసాక్షి)
ప్రజా శ్రేయస్సే నా లక్ష్యమని, ప్రజల అభివృద్దికే తోడ్పడుతానని, పైసలు సంపాదించుకోవడానికి తను రాజకీయాల్లో రావడంలేదని రామగుండం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్ పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేషన్ 45వ డివిజన్‌లోని ఇందిరానగర్, లూర్దునగర్‌తో పాటు పలు కాలనీల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా శంకర్ ఓటర్లతో మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడం జరిగిందని, ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డానన్నారు. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు టీఆర్‌ఎస్ టికెట్ కేటాయించడం పట్ల శంకర్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ… ఎలాంటి అభివృద్ధికి పాటుపడని సత్యనారాయణ మరోసారి గెలిపిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని అనడం ప్రజలను మరోసారి మోసం చేయడమేనన్నారు. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో తనే ఉద్యమకారునిగా చెప్పుకునే వ్యక్తి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజల సమస్యలపై పోరాడకుండా, ఎన్నికల సమయంలో అభివృద్ధి చేస్తానని, ఆశీర్వదించాలని ఓటర్లను ఓట్లు అడగటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రజలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకులను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత ఉందని పెద్దంపేట శంకర్ పేర్కొన్నారు. ఓట్ల కోసం పాకులాడే నాయకులను నిలదీయాలని అన్నారు. మహాకూటమి పేరుతో వచ్చే మరో నాయకుడు సైతం ఎన్నికల సమయంలో గోదావరిఖనికి వచ్చి ఓడిన అనంతరం హైదరాబాద్‌లో ఉండే నాయకుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని పెద్దంపేట శంకర్ ఆరోపించారు. స్తానికంగా లేని నాయకులకు ఓట్లు అడిగే నైతికత లేదన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని ఓటర్లను అభ్యర్థించారు. తనను రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని పెద్దంపేట శంకర్ కోరారు. గెలిచిన అనంతరం ప్రజా అవసరాలతో పాటు నిరుపేద నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడుతానన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాల కళ్యాణ్ పంజా, సిద్దా శంకర్, మల్లేశ్, రామస్వామి, రాజేందర్, సతీష్, సమ్మయ్య, బషీర్, మహేష్, అశీష్‌గౌడ్, లక్ష్మీ, శ్రావణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.