పొంచి ఉన్న ప్రమాదం

పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు

సమస్యను పరిష్కరించాలన్న ప్రయాణికులు

శంకరపట్నం,జనంసాక్షి, అక్టోబర్ 22:

రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ నుండి ఎరడపల్లి గ్రామానికి వెళ్లే దారిలో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదాలకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ద్విచక్ర వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. వెంటనే రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి ప్రమాదం జరగక ముందుకే మేలుకొని సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా అంటూ సంబంధిత అధికారులపై ద్విచక్ర వాహనదారులు మండిపడుతున్నారు. రహదారిపై ఏర్పడిన గొయ్యి పూడ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను మండల ప్రజలు కోరుతున్నారు.