పోడు భూముల సర్వే పారదర్శకంగా చేపట్టాలి
బాన్స్ వాడ ఆర్డీవో రాజాగౌడ్
జుక్కల్,అక్టోబర్ 13,(జనంసాక్షి),
పోడు భూముల సర్వే ను పారదర్శకంగా చేపట్టాలని
బాన్స్ వాడ ఆర్డీవో రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జరుగుతున్న పోడు భూముల సర్వే ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టాలని అదికారులను ఆదేశించారు. పోడు చేస్తున్న భూమిని కాకుండా కొత్తగా అటవీ భూమి ఆక్రమణ చేపట్టవద్దని తెలిపారు. జుక్కల్ మండలంలోని 15గ్రామాలలో పోడు సర్వే చేపట్టామన్నారు. అటవీ అధికారులు, రెవిన్యూ అధికారులు, సర్వే అధికారులు కలిసి రెండు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారని తెలిపారు. రైతులు ఈ భూములకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని తెలిపారు.2005డిసెంబర్ 13నుండి కబ్జాలో ఉన్నవారికి మాత్రమే పోడు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా కారణాలవల్ల పోడు భూములపట్టాల కోసం దరకాస్తు చేసుకో ని వారు కూడా అర్హులైతే పరిశీలించి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 28లోపు సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోడు రైతులు పట్టాల కోసం ఎవ్వరికి ఒక్క రూపాయి కూడ లంచంగాఇవ్వవద్దని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల తహసీల్దార్ గణేష్, గిర్ధావార్ రాంపటేల్, స్థానిక సర్పంచ్ రవి పటేల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగాధర్, కామారెడ్డిజిల్లా సిపిఎం నాయకులు సురేష్ గొండ తదితరులు పాల్గొన్నారు.
Attachments area