పోలింగ్ ప్రశాంతం
` తెలంగాణలో ముగిసిన ఓటింగ్
` 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్
` 6 గంటల వరకు 75 శాతం వరకు నమోదైనట్లు అంచనా
` తుది పోలింగ్ శాతంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
` హైదరాబాద్‌లో అతి తక్కువగా పోలింగ్ నమోదు
` అమరచింతలో మొరాయించిన ఈవీఎంలు
` కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం
` చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
` ఒక్కు హక్కు వినియోగించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థులు, సినీ ప్రముఖులు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో సాయంత్రం 6గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. 6గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గ్రావిూణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ఉత్సాహంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో గతంలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండటంతో రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సమయం ముగిసే సరికి దాదాపు75 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. తుది పోలింగ్ శాతంపై మంగళవారం ఉదయానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావితప్రాంతాలైన ఐదు ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లు సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసింది. జగిత్యాల జిల్లాలో ఓటేస్తూ ఫొటో తీసుకున్న జయరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలలోపు నిల్చున్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా సజావుగా పోలింగ్ కొనసాగింది. కాగా వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్ 228/77లో ఈవీఎంలు మొరాయించాయి. రెండు గంటలుగా ఈవీఎంలు పని చేయకపోవడంతో ఓటింగ్‌ను నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. మంథని..బెల్లంపల్లి లో ఎక్కవ శాతం ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అలాగే మంచిర్యాల లో సమయం ముగిసినప్పటికి ఓటర్లు బారులు తీరారు. అయితే ఉదయం నుంచే మందకొడిగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. నగరంలో అయితే ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. 65 శాతం దాకా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా పోలింగ్ పక్రియ ముగిసింది. తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ పక్రియ ముగిసింది. ఉదయం మొదలయిన పోలింగ్ సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ పక్రియ ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 69.81 శాతం, భువనగిరిలో 72.34 శాతం, చేవెళ్లలో 53.15 శాతం, హైదరాబాద్‌లో 39.17 శాతం, కరీంనగర్‌లో 67.67 శాతం, ఖమ్మంలో 70.76 శాతం, మహబూబాబాద్‌లో 68.60 శాతం, మహబూబ్‌నగర్‌లో 68.40 శాతం, మల్కాజ్‌గిరిలో 46.27 శాతం, మెదక్‌లో 71.33 శాతం, నాగర్‌కర్నూల్‌లో 66.53 శాతం, నల్లగొండలో 70.36 శాతం, నిజామాబాద్‌లో 67.96 శాతం, పెద్దపల్లిలో 63.86 శాతం, సికింద్రాబాద్‌లో 42.48 శాతం, వరంగల్‌లో 64.08 శాతం, జహీరాబాద్‌లో 71.91 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ లో 47.88 శాతం ` హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో సాయంత్రం 5 గంటల వరకూ 47.88 శాతం నమోదైంది. హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 53.15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై నిలబడ్డ తమపై ఎస్సై దాడి చేశారని.. నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఓ ఓటరు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సదరు ఓటరుపై కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా పిప్రియాల్ తండాలో సాయంత్రం 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి తండా వాసులు పోలింగ్ బహిష్కరించగా.. అధికారులు నచ్చచెప్పడంతో ఓటు వేసేందుకు సాయంత్రం వచ్చారు. కాగా, సమస్యలు పరిష్కరించలేదని గిరిజనులు ఓటింగ్ బహిష్కరించారు. హైదరాబాద్ పాతబస్తీ విూర్ చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఒకే రూట్ లో మాధవీలత, ఒవైసీ పోలింగ్ కేంద్రాలు పరిశీలించాన్నారు. రెండు వాహనాలు ఒకే రూట్ లో రావడంతో గందరగోళం నెలకొంది. మాధవీలతను పాతబస్తీ వాసులు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకులను అక్కడి నుంచి పంపించేశారు. అయితే, పోలీసుల తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఎన్నికల సిబ్బంది, కొందరు స్థానిక నేతలు ఇంటింటికీ తిరుగుతూ తలుపులు కొట్టి మరీ ఓటర్లను పిలిచారు. అంతా ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లతాండా పోలింగ్ బూత్ 160లో బాలకృష్ణ అనే ఓటర్ ఓటు వేసే దృశ్యాలను మొబైల్ లో వీడియో తీశాడు. తన తండ్రి గ్రామ పంచాయతీ సిబ్బంది కావడంతో ఫోన్ తో పోలింగ్ బూత్ లోకి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఓటు వేసిన వీడియోను సదరు ఓటరు సోషల్ విూడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది అభ్యంతరం తెలిపారు.
కొడంగల్‌లో ఓటేసిన సిఎం రేవంత్ రెడ్డి
ఉదయం వాతవారణం కొంత ప్రశాంతంగా చల్లగా ఉండడంతో ఓటర్లు వెంటనే బయటకు వచ్చి ఓటేశారు. ప్రముఖులంతా ముందే వచ్చి ఓటేశారు. చింతమడకలో కెసిఆర్, రామ్‌నగర్‌లో దత్తాత్రేయ, జూబ్లీహిల్స్‌లో సినీ ప్రముఖులు, కొడంగల్‌లో సిఎం రేవంత్ రెడ్డి, ఆయా ప్రాంతాల్లో మంత్రులు, అభ్యర్థులు ఓటేశారు. ప్రజలు కూడా గతంతో పోలిస్తే కొంత ఆసక్తిగా ముందుకు వచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నల్లొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు అనేది సామాన్యుల స్వరమని.. పాలకులని ప్రశ్నించేందుకు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని నేతలు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో, ఇతరాత్ర ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఈవో వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ (ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం విూడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కిషన్ రెడ్డిపై ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. కాగా సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతోంది.ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న జనాలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లూ అర్జున్, ఎన్టీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ఇతర ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్, అల్లూ అర్జున్, చిరంజీవి దంపతులు, డైరెక్టర్ తేజ ఇతర ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాని చేరుకుని ఓటు వేశారు. ఇకపోతే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50.18 శాతం, నాగర్‌కర్నూల్ పరిధిలో 45.88 శాతం, జహీరాబాద్ పరిధిలో 50.71 శాతం, భువనగిరిలో 46.49, చేవెళ్లలో 34.56 శాతం, హైదరాబాద్‌లో 19.37 శాతం, కరీంనగర్‌లో 45.11 శాతం, ఖమ్మంలో 50.63 శాతం, మహబూబాబాద్‌లో 48.51, మహబూబ్‌నగర్‌లో 45.84 శాతం, మెదక్‌లో 46.72 శాతం, మల్కాజ్‌గిరి పరిధిలో 27.69 శాతం, నల్లగొండలో 48.48 శాతం, నిజామాబాద్‌లో 45.67 శాతం, పెద్దపల్లిలో 44.87 శాతం, సికింద్రాబాద్‌లో 24.91, వరంగల్ పరిధిలో 41.62 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్‌లో 20 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో వికాస్ రాజ్ ఉదయం 9గంటల ప్రాంతంలో తెలిపారు. ఓటర్ స్లిప్పులు పరిశీలించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశామని.. సీఎం రేవంత్ పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని.. ఒంటిగంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో 50 శాతం ఓటింగ్ నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళల బురఖా తొలిగించి పరిశీలించడంపై అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. జనగామలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. యువజన కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి పోలింగ్ సరళి చూసేందుకు రాగా.. బీఆర్‌ఎస్ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే పల్లా రజాఏశ్వర రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.తెలంగాణలో పోలింగ్ పక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రామ్ నగర్ లో ఉన్న జీవి హైస్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 234 లో తమ ఓటు వేశారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమని, ఓటుతో మార్పు తేవచ్చని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలని కోరారు.