ప్రకటనలకు కేంద్రం ఖర్చు రూ. 4343కోట్లు

– ఆర్టీఐ చట్టం ద్వారా వెల్లడి
ముంబయి, మే14(జ‌నం సాక్షి) : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వివిధ విూడియాల్లో ప్రచారం, ప్రకటనలనపై ఇప్పటివరకూ రూ 4343 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం ప్రచారంపై వెచ్చించిన మొత్తం నిధుల గురించి ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త అనిల్‌ గల్గాలి ఆర్‌టీఐ కింద సమాచారం రాబట్టారు. జూన్‌ 2014 నుంచి ప్రభుత్వం ప్రచారంపై విపరీతంగా వెచ్చించిందని, దీనికి సంబంధించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2017లో కొద్దిమొత్తంలో రూ 308 కోట్ల మేర ప్రకటనల బడ్జెట్‌లో కోత విధించిందని గల్గాలి చెప్పారు. 2014 జూన్‌ నుంచి మార్చి 2015 వరకూ ప్రభుత్వం ప్రింట్‌ విూడియాలో రూ 424.85 కోట్లు వెచ్చించగా, ఎలక్టాన్రిక్‌ విూడియాలో రూ 448.97 కోట్లు ప్రకటనలపై ఖర్చు చేసిందని వెల్లడైంది. ఇక అవుట్‌డోర్‌ పబ్లిసిటీకి రూ 79.72 కోట్లు వెచ్చించిందని బ్యూరో ఆఫ్‌ అవుట్‌రీచ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (బీఓసీ) ఆర్థిక సలహాదారు తపన్‌ సూత్రధార్‌ బదులిచ్చారు. ఇక 2015-16లో ప్రింట్‌ విూడియలో రూ510 కోట్లు , ఎలక్టాన్రిక్‌ విూడియాలో రూ  541.99 కోట్లు, అవుట్‌డోర్‌ పబ్లిసిటీపై రూ 118 కోట్లు వెచ్చించింది. 2016-17లో ప్రింట్‌ విూడియాలో ప్రకటనల వ్యయం రూ 463.38 కోట్లకు తగ్గగా, ఎలక్టాన్రిక్‌ విూడియాలో ప్రకటనలపై రూ 613 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అవుట్‌డోర్‌ పబ్లిసిటీపై 185.99 కోట్లు వెచ్చించింది. మరోవైపు 2017 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి వరకూ ఎలక్టాన్రిక్‌ విూడియాలో ప్రచార వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ 475.13 కోట్లకు తగ్గింది. అవుట్‌డోర్‌ ప్రచార వ్యయం కూడా రూ 147 కోట్లకు తగ్గింది.