ప్రకాశం బ్యారేజీలో రెండు రోజులకు సరిపోను నీటినిల్వ ఇరిగేషన్‌ అధికారుల వెల్లడి విజయవాడ

, జూలై 18 : కృష్ణా డెల్టాకు సరఫరా చేయడానికి తగినంత నీరు ప్రకాశం బ్యారేజీలో నిల్వ లేని పరిస్థితి ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్‌ నుండి ఇప్పటివరకు నీరు బ్యారేజీకి అందుతుండగా రాష్ట్ర హైకోర్టు ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుంది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లో 510 అడుగుల లోతు నీరు ఉంటే కృష్ణాడెల్టాకు అక్కడి నుండి నీటిని విడుదల చేయవద్దని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నాగార్జునసాగర్‌ నుండి ప్రకాశం బ్యారేజీకి నీరు రావడం అనుమానాస్పదంగా మారింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీలో ఉన్న నీరు రెండు రోజులకు సరిపోతాయని ఇరిగేషన్‌ శాఖాధికారులు చెబుతున్నారు. ఆ తదుపరి వర్షాలు పడని పక్షంలో కృష్ణాడెల్టాకు నీటి విడదల నిలిపివేయకతప్పదని వారు వెల్లడించారు. ఇదే జరిగితే రైతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో నీటిని కృష్ణాడెల్టాకు విడుదల చేయడానికే ప్రయత్నిస్తామని ఇరిగేషన్‌ అధికారులు బుధవారం వెల్లడించారు.