ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నం:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : మహమ్మారి కరోనాతో యావత్‌దేశం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) 95వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో నిరంతరం గెలుపు కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నవారే చివరికి విజేతలవుతారని మోదీ వ్యాఖ్యానించారు. సమస్యలకు భయపడితే ముందుకెళ్లలేమని పేర్కొన్నారు. మన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించే సమయమిదని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను పీడిస్తున్న కరోనా కాలంలో బాధిత దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయని చెప్పారు. స్వదేశీ నినాదంతో మనం ముందుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని,  ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు.