-->

ప్రగతి భవన్ ముట్టడిస్తాం

* ఓసి జెఎసి నేత పోలాడి రామారావు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :
ఓసిల్లోని పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కెసీఆర్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని,
ఆగస్ట్ 15 లోగా అమలు చేయాలని లేదంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రెడ్డి సంఘాల జేఏసీ ఉత్తర తెలంగాణా జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బుధవారం పట్టణంలో నిర్వహించిన ఓసి సంఘాల జేఏసీ నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు.
5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్, 1000 కోట్లతో వైశ్య కార్పోరేషన్ ఇతర ఓసి పేదల సంక్షేమానికి 1000 కోట్ల నిధులు కేటాయించి గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యుఎస్ విద్యార్థుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో గురుకుల కళాశాల స్టడీ సర్కిల్లు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు .
విదేశీ విద్యకోసం 25 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు .
75 యేండ్ల స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సావాలు జరుపుకుంటున్న తరుణంలో ఆగస్ట్ 15 లోగా సీఎం కేసిఆర్ ఓసిలకు ఇచ్చిన హామీలను అధికారికంగా ప్రకటించాలని పోలాడి రామారావు పెండ్యాల రాంరెడ్డి డిమాండ్ చేశారు.
ఓసి సామాజిక సంఘాల సమాఖ్య ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల పేదల తో పాటు ఓసిల్లొని పేదలకు ఆర్థిక ప్రాతిపదికన విద్యా ఉద్యోగాల్లో సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని అన్నారు.
ఈ సమావేశలో ఓసి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహ్మారెడ్డి, నాయకులు ఎక్కేటీ సంజీవరెడ్డి, ముచ్చ సమ్మిరెడ్డి, నల్లా కొండాల్ రెడ్డి, తాటిపల్లి రాజన్న, అవిరినేని సంపత్ రావు, దేవరాజుల మనోహర్ శర్మ తదితరులు పాల్గొన్నారు