ప్రచారంపై దృష్టి పెట్టిన షబ్బీర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న అలీ

కామారెడ్డి,నవంబర్‌17(జ‌నంసాక్షి): మొన్నటి వరకు చర్చల్లో బిజీగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి శాసనమండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ ఇప్పుడు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. నాలుగేళ్లలో టిఆర్‌ఎస్‌ సాధించింది శూన్యమంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం మరింత అప్పులపాలవుతుందని విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గంలో గంప గోవర్ధన్‌ పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఏ ఒక్క శాశ్వత అభివృద్ధి పనులను చేయలేదని అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి ప్రజలు పట్టకట్టనున్నారన్నారు. సోనియాగాంధీ , రాహుల్‌గాంధీ అంకితభావంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేశారన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేశానని, తన హాయంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇక్కడ జరుగలేదన్నారు. అలాగే కేసీఆర్‌ గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేక పోయారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని షబ్బీర్‌ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి కేసీఆర్‌ కుటుంబంలోనే న లుగురికి పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. శుక్రవారం కామారెడ్డిలో రెండు నామినేషన్‌ సెట్లను దాఖలు చేసారు.