ప్రచారంలో సోమారపు కొత్తపంథా

సింగరేణి ఓట్లు జారిపోకుండా జాగ్రత్తలు

మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది

కెసిఆర్‌ పథకాలే శ్రీరామరక్ష అంటూ ప్రచారం

గోదావరిఖని,నవంబర్‌21(జ‌నంసాక్షి): సింగరేణి కార్మిక ఓటర్లే ఇప్పుడు సోమారపు సత్యానారాయణ బలం. వారి ఓట్లు గంపగుత్తగా టిఆర్‌ఎస్‌కు పడతాయన్న ధైర్యం..వారికి అన్ని విధాలుగా అండగా నిలిచిన కారణాన ఇప్పుడు వారంతా సోమారపు జై అంటున్నారు. స్థానిక నేతగా ఆర్టీసీ ఛైర్మన్‌గా తాను సంపదాఇంచుకున్న అభిమానంతో రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్తి సోమారపు సత్యానారాయణ ప్రచారంలో ముందున్నారు. అన్నా నమస్తే అనగానే నీకే ఓటంటూ ప్రతి నమస్కారాలు చేస్తున్న దృశ్యలు కనిపిస్తున్నాయి. అందుకే అధికారం కోసం జత కట్టిన కూటమిని కాటికి పంపడం ఖాయమనిసోమారపు సత్యనారాయణ ధీమాగా ఉన్నారు. గోదావరిఖనిలో ఆయన ప్రధానంగా అన్ని వర్గాల వారిని కలపుకుని ముందుకు సాగుతుఉన్నారు. ఉదయం మొదలు సాయంత్రం వరకు ప్రచారంలో ఉంటున్నారు. అభివృద్ది పథకాలను ప్రస్తావిస్తున్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే యోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలతో రైతులకు వ్యయసాయం లాభసాటిగా మారిందని, కులవృత్తులను ప్రోత్సహించామని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలు అధికారం కోసం పార్టీ సిద్దాంతాలను తుంగలో తొక్కి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీకాని, నాయకుడు కాని లేరన్నారు. అందుకే కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీతో జత కట్టిందని, వీటితో పాటు తెలంగాణ జన సమితి, సీపీఐలు ఒకటయ్యాయన్నారు. సీట్లు కూడా సర్దుబాటు చేయలేని కూటమికి ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు లేరన్నారు. 68 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేసిందని సోమారపు అన్నారు. యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, రైతులకు సబ్సిడీపై పాడి గేదెలు, మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ, కుల సంఘాల భవనాల నిర్మాణం ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారన్నారు. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ పాలకులు కరెంటు అడిగిన ప్రజలపై కాల్పులు జరిపి గుర్రాలతో తొక్కించారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు అడగకుండానే 24గంటలపాటు ఉచిత కరెంటు అందించిందన్నారు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతి తదతర అంశాలను మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామగుండం ప్రాంతంలో కొంతమంది మోసపూరిత నాయకులు ముందుకు వస్తున్నారనీ, నేర చరిత కలిగిన వారంతా జత కడుతున్నారనీ, అలాంటి వారికి అధికారం ఇస్తే అభివృద్ధిలో మళ్లీ వెనక్కిపోక తప్పదని హెచ్చరించారు. తాను మొదటి నుంచి నిజాయతీగా, నిబద్ధతతో ఏలాంటి ఆరోపణలకు తావు లేకుండా సేవ చేస్తున్నానని తెలిపారు. మరోమారు ఎన్నుకుని అవకాశం ఇస్తే రెండింతల అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

వివిధ ప్రాంతాల్లో భారీగా రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా జనం తరలిరావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సహం వ్యక్తమైంది. రోడ్‌షోలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ సోమారపు ఓట్లు అభ్యర్థించారు.