ప్రజలంతా కదిలితేనే పిల్లలను కాపాడుకుంటాం

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారంపై రాహుల్‌ ఆందోళన

ఇండోర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): దేశ ప్రజలుగా మనమంతా కలిసికట్టుగా మన పిల్లల్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో మూడు రోజుల క్రితం స్కూలు నుంచి ఓ ఎనిమిదేళ్ల బాలికను అపహరించుకు వెళ్లి అత్యాచారం చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ, బాధితురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్‌ చేసారు. తన ఆవేదనను, ఆగ్రహాన్ని రాహుల్‌ ఓ ట్వీట్‌లో వ్యక్తం చేశారు. ‘మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారు. ఆమె ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. చిన్నపిల్లపై జరిగిన ఈ దారుణం నా మనసును తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఒకే దేశానికి చెందిన మనమంతా మన పిల్లల్ని కలిసికట్టుగా కాపాడుకుందాం. దాడికి పాల్పడిన వారికి సత్వర శిక్ష, బాధుతురాలి తక్షణ న్యాయం జరిగేలే చూడాలి’ అని రాహుల్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, బాలకపై జరిగిన అత్యాచారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్‌ చేశారు. ‘ఎఫ్‌ఐఆర్‌కు చాలా సమయం పడుతోంది. ఇవాళ కూడా దర్యాప్తు సరైన దిశగా సాగలేదు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి. ఇక్కడ మా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది’ అని సింధియా విూడియాతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు, అత్యాచార బాధితురాలైన బాలికకుప్రాణాపాయం తప్పిందని, క్రమంగా కోలుకుంటోందని ఇండోర్‌లో ఆమెకు వైద్యచికిత్స అందిస్తున్న ఎంవై ఆసుపత్రి వైద్యులు ఒక మెడికల్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు.