ప్రజలకు చేరువగా ఆరోగ్యమిత్ర కార్యకర్తలు

ఏలూరు, జూలై 19 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రోగులకు మరింత విస్తృతసేవలు అందించడానికి ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ప్రజలకు చేరువచేయనున్నట్లు ఆరోగ్యశ్రీ జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి జి. రాజేంద్ర చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం ఆరోగ్యమిత్ర కార్యకర్తలకు అవగాహనా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో 3వేల 417మంది ఆరోగ్యమిత్ర కార్యకర్తలు ఇప్పటికే విస్తృతమైన సేవలు అందిస్తున్నారని భవిష్యత్తులో మరింత పటిష్టవంతమైన సేవలు అందించడానికి ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ప్రజలకు మరింత దగ్గరగా ఉండడానకి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని డా. రాజేంద్ర చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎక్కడా కూడా పైసా ఖర్చులేకుండా పేదవర్గాలకు ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించి వారి అభిమానాన్ని చూరగొనేలా ఆరోగ్యమిత్ర కార్యకర్తలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఆరోగ్యశ్రీ పథకం అమలులో మైక్రోస్థాయిలో లోపాలను గుర్తించి భవిష్యత్తులో అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడడానికి ఆరోగ్య కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా సేవలు అందజేయాలని రాజేంద్ర చెప్పారు. పేదవర్గాలకు ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పధకం ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచిందని ఎంతోమంది అగ్రరాజ్య ప్రముఖులు కూడా మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఆరోగ్యశ్రీ పధకాన్ని పరిశీలించడానికి వస్తున్నారంటే ఈ పధకం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో స్పష్టమవుతుందని జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ కెవి. ప్రభాకర్‌రావు చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీ పధకాన్ని ఆయా రాష్ట్రాలలో అమలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని అక్కడ మనరాష్ట్రానికి చెందిన నిపుణులే కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తలు ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించి అంకిత భావంతో పనిచేయాలని, పేదలకు మరింత చేరువ కావాలని ప్రభాకరరావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 150 మందికి పైగా ఆరోగ్యశ్రీ కార్యకర్తలు పనిచేస్తున్నారని, కొత్తగా తొమ్మిది పిహెచ్‌సిలలో ఆరోగ్యమిత్ర కార్యకర్తలను కలెక్టరు నియమించనున్నారని, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మరో ముగ్గురిని నియమిస్తారని చెప్పారు. జిల్లాలోని పదిహేడు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు జరుగుతున్నాయని ఎనిమిది ప్రభుత్వ, తొమ్మిది ప్రైవేట్‌ కార్పొరేట్‌ వైద్యశాలల్లో అవసరమైన వైద్యాన్ని పేదవర్గాలు ఉచితంగా పొందుతున్నారని ఆయన చెప్పారు. జిల్లాలో తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్న పేదవర్గాలు అనారోగ్య సమస్య తలెత్తినా ఆరోగ్య మిత్ర కార్యకర్తలను సంప్రదించి ఆధునిక వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చునని చెప్పారు. ఆరోగ్యశ్రీ వరంగల్‌ జిల్లా మేనేజరు శ్రీ ప్రమోద్‌కుమార్‌, ఫోస్‌ ఎగ్జిక్యూటివ్‌ శ్రీ సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.