ప్రజలకు భారంగా పాలకుల నిర్ణయాలు
గుదిబండగా మారిన మోడీ ఆర్థిక విధానాలు
సామాన్యులకు దూరంగా బ్యాంక్ సేవలు
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ పూటతిని ఓ పూట పస్తులుండి కూడబెట్టుకోవడం అలవాటు. చిన్నమొత్తాల పొదుపుతో సంసారాలు లాగిస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా భారంగా మారిన దశలో ప్రతిదానికీ పన్ను కట్టాలన్న దురాలోచన ప్రభుత్వాలకు అవసరమా అన్నది ఆలోచించాలి. సమాంతర ఆర్థిక వ్యవస్థను సవాలు చేసే ప్రయత్నాలు సరికాదు. విపరీతంగా పన్నలు బాదుడు కారణంగా ప్రజలు పన్నులు ఎగ్గొట్టే అవకాశాలు వెతుకుతారు. ఇలాంటి పరిస్థితి ఎందుకన్నది చర్చించాలి. ప్రజలు తాము సంపాదించిన డబ్బును ధైర్యంగా బ్యాంకుల్లో వేసుకుని నింపాదిగా ఉండే వ్యవస్థ కావాలి. బ్యాంకులు ప్రజలకు దూరంగా..ఎగవేత దారులకు
దగ్గరగా అవుతున్న వైనం పోవాలి. బ్యాంకుల సంస్కరణలు రావాలి. ఎగవేతదారులకు వణుకు పుట్టాలి.
పారదర్శక విధానాలు ఉంటే..బ్యాంకులు ప్రజల కోసమే ఉంటే..ప్రజలకు చిట్టీలు వేయడం,కూడబెట్టుకోవడం అన్నది ఉండదు. నేరుగా బ్యాంకుల్లోనే డబ్బును దాచుకుంటారు. తామే ప్రజలను పట్టించుకోవడం లేదని పాలకులు గుర్తించడం లేదు. డబ్బు బ్యాంకులో పడిన ప్రతిపైసా నల్లధనంగా పరిగణించే విధానం పోవాలి.
నోట్లరద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మొదలైన ఆర్థికరంగం తరవాత అదేపనిగా తీవ్రంగా దెబ్బ తింటూ వచ్చింది. మోదీ ప్రభుత్వం ఇలా చేజేతులా చేసిన పాపాల జాబితాలో ఇంకా అనేకం ఉన్నాయి. జీఎస్టీ, ఎన్నికల బాండ్లు మరింత దుర్మార్గమైనవి. పార్టీలకూ కార్పొరేట్ సంస్థలకు మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరిచాయి. కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తాయి. ఎన్నికలకు ముందు, తరువాత కూడా ఈ బాండ్ల బంధం దృఢంగా కొనసాగుతూనే ఉంటుంది. జిఎస్టీ స్లాబులు చూస్తుంటే కేవలం అహంకార ధోరణిని మోడీ సర్కార్ కొనసాగిస్తోందని రుజువు అవుతోంది. ఏకీకృత పన్ను విధానం పేరుతో మోడీ ప్రభుత్వంతీసుకుని వచ్చిన జిఎస్టీతో ఎన్ని అగచాట్లు పడుతున్నారో ఎన్నడైనా చర్చించారా…? మోడీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వంటి చర్యల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నది. పెద్దనోట్ల రద్దు మౌలిక సంస్కరణ అన్న మోడీ ఇప్పటి వరకు జరిగిన నష్టాలను పరిగణించడం లేదు. కనీసంగా పునరాలో చన చేయడం లేదు. ఆయా రాష్టాల్రు కోరుతున్నా పరిశీలన చేయడం లేదు. నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని చెప్పు కోవడమే తప్ప అందుకు సామాన్యులు పడుతున్న కష్టాలను గుర్తించడం లేదు. నగదు లభ్యత శాతం తగ్గిందని, తాత్కాలిక సవాళ్లు ఉండొచ్చని అంటున్న మోడీ శాశ్వత సవాళ్లపై చర్చించడం లేదు. నోట్లరద్దుతో పెరిగిన ఆర్థిక గందర గోళం, జిఎస్‌టి విధింపుతో వస్తు, సేవల రంగాలలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ మహా మాంద్యం వైపు అడుగులు వేస్తోందని ఆందోళన వ్యక్తం అవుతున్నా పట్టించుకోకుండా గుడ్డిగా పాలన చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ వాతలు పెట్టవచ్చో అని శోధిస్తున్నారు. వ్యవసాయ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గుతుండటం తో నిరాశ, నిస్పృహ లకు గురవుతున్న రైతన్నలు వీధుల్లోకెక్కుతున్నారు.. ఇప్పటికే ప్రజల్లో వెల్లువెత్తు తున్న వ్యతిరేకతకు తోడు ప్రతిపక్షాలు కూడా మోడీ ప్రభుత్వ నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఈ క్రమంలో దేశీయంగా పన్నలు విధానాం సవిూక్షించాలి. ప్రజలను దొంగలుగా చూపి పన్నులు ముక్కు పిండి వసూలు చేసే విధానాలు పోవాలి. దీనిపై ప్రాంతీయ పార్టీలు తొలుత చర్చించాలి. ప్రజల్లోకి తీసుకుని పోవాలి. అప్పుడే ప్రజలు తము పడుతున్న బాధలేంటో చెబుతారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీపై కూడా అటు సొంతపార్టీలోనూ, బయటా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. మొన్నటికి మొన్న చేనేతపై జిఎస్టీ పెంచాలని చూశారు. ముఖ్యంగా ఆర్థిక మందగమనం, ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్న యువత, పంటలకు గిట్టుబాటు ధర లభించని రైతన్నల ఆగ్రహం వంటి వాటితో ప్రధాని మోడీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రధానిపై గతంలో విమర్శనాస్త్రాలు సంధించారు. అయినా ఇవేవీ పట్టించుకునే స్థితిలో మోడీ లేడు. ఆయనప్రయోజనాలు వేరుగా ఉన్నాయి కనుకనే ప్రజలకోణంలో కరెక్ట్ అని చెప్పడం అలవాటు చేసుకున్నాడు. చాయ్ అమ్ముకునే స్టేజి నుంచి వచ్చిన వాడికి ప్రజల ఆకలిబాధలు తెలియాలి. కానీ మోడీకి అవేవీ తెలవనడానికి ప్రస్తుత పాలనే నిదర్శనం. అందుకే జిఎస్టీని మరింతగా విస్తరించి సామాన్యుల నడ్డి విరిచేందుకు కొరడా రaళిపిస్తున్నారు. దీని ప్రభావంతో ప్రజలకు చుక్కలు చూపించిన
మోడీ సర్కార్ రియల్ రంగంపైనా తన దృష్టిని సారించి వడ్డింపులను పెంచేసింది. నోట్ల రద్దుతో బ్యాంకుల్లో వడ్డీలు తగ్గుతాయని, గృహరుణాలు చౌకగా మారుతాయని చేసిన ప్రచారం ఉత్తిదే అని తేలిపోయింది. రియల్ రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సామాన్యులు, పేదమధ్య తరగతి ప్రజలు ఇల్లు కొనుక్కునే స్థితి లేదు. నిజానికి ఈ రంగంలో అధ్యయనం చేసి ప్రజలు తమంత తాముగా ఇల్లు కొనుక్కు నేలా చేస్తే ప్రజలు హర్షించేవారు. కానీ అలా జరగడం లేదు. ఉద్యోగం చేస్తున్న వారు బ్యాంక్‌కు వెళ్లి రుణం తీసుకుని ఇల్లు కొంటే 30 ఏళ్లయినా రుణం తీరని రోజులివి. అలాగే సవాలక్ష సమస్యలు. రిజిస్టేష్రన్ ఛార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయి. పేద మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను మోడీ ప్రభుత్వంతో పాటు, రాజ్యాంగ సవరణలు అంటున్న కెసిఆర్ కూడా కూల్చేశారు. పన్నుల ఎగవేత అత్యధికంగా ఉండే రంగం రియల్ ఎస్టేటేనని ,అక్కడే నగదు లావాదేవీలు ఎక్కువగా ఉంటాయని పాలకుల భావన. కానీ పారదర్శక విధానాలు ఉంటే ఏ ఒక్కరూ పన్నులు ఎగవేయరని గుర్తించడం లేదు. పన్నులు ఎక్కడ వేసినా వాటి మంట ప్రజలకే తగులుతుందని పాలకులు గుర్తించాలి. నిజంగా గృహ నిర్మాణం పారదర్శకంగా సాగక పోవడానికి కేంద్ర రాష్టాల్రు అనుసరిస్తున్న విధానాలే కారణం. దీనిపై అధ్యయనం చేయకుండా ఎక్కడ నుంచి ఎలా పన్నులు రాబట్టాలన్నదే ప్రభుత్వాల లక్ష్యంగా కనిపస్తోంది. భూమి, ఇతర స్థిరాస్తులపై ఎలాంటి జీఎస్టీ ఉండదని మొదట్లో తెలిపి తరవాత ఇల్లు కొనేవారికి దానిని ఓ భారంగా మార్చారు. ప్రభుత్వాలు ఉన్నదానికి కాస్తంత ఎక్కువచేసి చెప్పుకోవడం సహజమే. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లేనిదానిని ఉన్నట్టుగా, జరగనిదానిని జరిగినట్టుగా చూపుతూ అందరినీ మించిపోయింది. నిజాన్ని ఒప్పుకోవడం, లోపాలను అంగీకరించకపోవడం వంటి లక్షణాలు అస్సలు కనిపించవు. ఇక, సరిదిద్దుకోవడమన్నది లేనేలేదు.