” ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం… సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర “

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 22( జనంసాక్షి): విషయం ఏదైనప్పటికీ అంతిమంగా ప్రజల బాధ్యత ముఖ్యమని, దాని తర్వాతే మిగిలిందేదైనా అని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. ఈమేరకు శనివారం కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాపరిధి సినిమా థియేటర్ యజమానులతో ప్రత్యేకసమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా సినిమా థియేటర్ల యజమానులు థియేటర్ల లైసెన్సులను తక్షణమే రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. థియేటర్ కు సంబంధించి పాఠంచాల్సిన భద్రత, నిబంధనలను విధిగా పాటించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రమాణాలు పాటించకపోతే థియేటర్లలో ప్రమాదాలు జరిగే అవకాశంఅధికంగా ఉంటుందని, ప్రజల భద్రతకు ఇది తీవ్రమైన ముప్పుగా సిపి వివరించారు. ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి విభాగం తదితర కీలకమైన సంస్థలనుండి లైసెన్సులను తీసుకొని అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి లైసెన్సును పొందాలని వారికి సూచించారు. లైసెన్సులను రెన్యువల్ చేసుకోని థియేటర్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులను జారీ చేయడం జరిగిందని, అయినా స్పందించని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. ఈ మధ్యకాలంలో నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, రద్దీగా ఉండే రోడ్లపై రద్దీని నియంత్రించడానికి టైం షెడ్యూల్ పాటించాలని తద్వారా ఆయా రోడ్లపై ట్రాఫిక్ సమస్య కొంత తగ్గుతుందని సిపి తెలిపారు. సినిమా థియేటర్ల యజమానులు రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా సిబ్బందిని వినియోగించుకోవడం, ఇతర మార్గాల ద్వారా వాహనదారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ జాయింట్ సిపి అవినాష్ మహంతి, ట్రాఫిక్ డిసిపి టి. శ్రీనివాసరావు, మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, బాలానగర్ డిసిపి సందీప్, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డిసిపి ఇందిర, ఏసిపిలు, డిఎఫ్ఓలు సుధాకర్ రావు, శ్రీధర్ రెడ్డి, పూర్ణచందర్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.