ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు చేయండి

2

తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం

హన్మకొండ ,ఆగస్టు 29(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం బహిర్గతం చేయాలని, తెలంగాణ జేఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.సోమవారం హన్మకొండ హరితకాకతీయ హోట్‌ల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో  వరంగల్‌ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.జిల్లాల విభజన జరిగేటప్పుడూ స్థానిక పరిస్థితులను అధ్యాయణం చేసి చరిత్రను, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని,తుది నిర్ణయం ప్రజాభీష్టానికి అనుకూలంగా విభజన జరుగాలని అన్నారు.గ్రామపంచాయితీలు, మండల పరిషత్‌ల, వివిధ ప్రజా సంఘాల తీర్మాణాలను కూడా ప్రభుత్వం విభజనకు ప్రాథిపదికగా తీసుకోవాల్సి ఉండేనని,ఆలా కాకుండా ఏకపక్షంగా విభజిస్తుండడం వల్లనే ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారని అన్నారు.బంద్‌లు,రాస్తారోకోలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభీష్టాన్ని తెలియజేస్తాయని,వరంగల్‌ నగర విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 30న జరిగే బంద్‌ ద్వారా ప్రజలు తమ నిరసనను,వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలుపాలని సూచించారు. వరంగల్‌, హన్మకొండ ప్రజలను విడదీయడమనే భావనే ఊహించడానికి కష్టంగా ఉందని, రెండు పట్టణాల మద్య శతాభ్దాలుగా బలీయమైన చారిత్రక, ఆర్థిక సంబందాలు ఉన్నాయని, వీటిని ఒకే జిల్లాగా ఉంచాలని కోరారు.జిల్లాల విభజన కూడా చట్టబద్దమైన పద్దతులలో శాంతియుతంగా జరుగాలని,మేజార్టీ ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేలా చూడాలని సూచించారు.అభ్యంతరాలను తెలిపేందుకు అందరికీ మెయిల్‌ అందుబాటులో ఉండదని,దానికి బదులు టెలిఫోన్‌ నెంబర్‌ పెడితే బాగుంటుందని, ఆలాగే సిసిఎల్‌ఎ, జిల్లా కలెక్టరేట్‌లలో మాత్రమే వినతి పత్రాలు ఇవ్వడం కాకుండా ఆర్డీఓ, మండల స్థాయిలో కూడా అభిప్రాయాలు తెలిపేలా సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ మంగళవారం జరిగే బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రజలు నగర విభజనపై తమ వ్యతిరేకతను తెలుపాలని,కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు భయపడకుండా బంద్‌లో పాల్గొనాలని కోరారు.బిజేపి నేత మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ వరంగల్‌ నగరాన్ని వరంగల్‌ నగరాన్ని విభించి పాలించాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.సిపిఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ హన్మకొండ జిల్లాకు బదులు జనగామను జిల్లా చేయాలని, విపక్షాల ఆందోళన వల్లనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నగర విభజనపై వెనక్కి తగ్గారని అన్నారు.టిడిపి జిల్లా అద్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ కాకతీయుల చరిత్రను కనుమరుగు చేసేలా   ప్రభుత్వం కేవలం టిఆర్‌ఎస్‌ నేతల కోసం నగరాన్ని విభజిస్తున్నదని విమర్శించారు.ఈ సమావేశంలో రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ సభ్యులు ముద్దసాని సహోదర్‌రెడ్డి,ప్రొఫెసర్‌ కూరపాటి వెంకట్‌నారాయణ, జనగామ జేఎసి ఛైర్మన్‌ ఆరుట్ల దశమంతరెడ్డి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి ఈసంపల్లి వేణు,బిఎస్‌పి,న్యూడెమోక్రసి,వైఎస్సార్‌సిపి నాయకులు గంధం శివ, ఆర్‌.బాలరాజు, కిషన్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌,తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు చిల్లా రాజేంద్రప్రసాద్‌, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ్ల వేణుగోపాల్‌గౌడ్‌,బిసి జెఎసి నేత తిరుణహరీ శేషు, ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ కన్వీనర్‌ టి.సుధాకర్‌, ఆర్టీసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ రీజినల్‌ కార్యదర్శి ఈదురు వెంకన్న తదితరులు పాల్గొని మాట్లాడారు.

జనగామ జిల్లాకు కోదండరామ్‌ మద్దతు

జనగామ జిల్లా ఏర్పాటుకు జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ మద్దతు పలికారు. జనగామకు అన్ని అర్హతలు, వసతులు ఉన్నాయని అన్నారు. సోమవారం ఆయన ఆందోళనచేస్తున్న అఖిపక్ష నేతలను కలసి పరామర్శించారు. వారికి మద్దతు పలికారు. జెఎసి నాయకులు దశమంతరెడ్డి, కన్నా పరశురాములు తదితరలుతో చర్చించారు. ఈ  విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించారు. జనగామవిసయంలో డిమాండ్‌ను ఆలోచన చేయాలని, హన్మకొండపై డిమాండ్‌ లేకున్నా తెరపైకి తేవడం తగదన్నారు. వరంగల్‌ నుంచి వేరుచేసి హనుమకొండను జిల్లాగా చేయడం ఎంత అనుచితమో జనగామను జిల్లాగా చేయకపోవడం అంతే అనుచితమన్నారు. జనగామ చరిత్ర ఎంతో గొప్పదని, నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో మడమ తిప్పని పోరుచేయడం సహా మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలోకూడా ఎంతో వీరోచితమైన పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రం ఇప్పుడు హైదరాబాదు తర్వాత వరంగల్‌ వైపే చూస్తున్న క్రమంలో హనుమకొండను జిల్లాగా చేసి విభజించడం, జనగామను విస్మరించడం అంత మంచిది కాదని కోదండరామ్‌ అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మక నేపథ్యమున్న జనగామ చరిత్రనను  తీసుకుని జిల్లాగా ప్రకటించాలని, ఇక్కడి ప్రజల ఉద్యమ స్ఫూర్తిని గౌరవించాలని హితవు చెప్పారు.తమ  వినతిని సర్కార్‌ గమనిస్తుందని భావిస్తున్నామని కోదండరామ్‌ అన్నారు.