Janam Sakshi - Telugu Daily News Portal > జిల్లా వార్తలు > హైదరాబాద్ > వార్తలు > ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం -పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు. / Posted on June 7, 2022
ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం -పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు.
ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం -పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు.
– తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.
– సర్కారు దవాఖానలో వైద్యం, సకల వసతులు
– రామవరం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట బ్యూరో 06, జూన్ ( జనం సాక్షి )
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు పెరగాలి. నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని ఆరోగ్య శాఖ సిబ్బందికి మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సర్కారు దవాఖానలో అన్నీ వసతులు ఉన్నాయని, అన్నీ రకాల వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం రామవరంలో గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీశ్ తో కలసి ప్రారంభించారు. ఈ మేరకు ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలతో గ్రామాల వారీగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు, ప్రయివేటు ఆసుపత్రిలలో ప్రసవాలు, వాటిలో నార్మల్, సిజేరియన్ల అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రికి తేడా ఏమిటో తెలియ చేయాలని ఆరా తీశారు. ప్రయివేటు దవాఖానకు పోతే ఖర్చులు అవుతాయని, పెద్ద ఆపరేషన్లు చేయొద్దని, తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని సూచిస్తూ.., గర్భిణీలకు ఆసుపత్రిలో వ్యాయామం చేయించాలని, దీంతో నార్మల్ డెలివరీలు సులభంగా చెయొచ్చుననే విధానం తీరు, పెద్ద ఆపరేషన్ల ద్వారా జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలు ప్రజల ప్రతీ మనిషి ఆరోగ్య స్థితిగతులైన బీపీ, షుగర్ తదితర వ్యాధులు గుర్తించిన అంశాలపై ఆరా తీసి ప్రభుత్వమే ఇంటింటికీ వెళ్లి ఎన్సీడీ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.
– నార్మల్ డెలివరీలు చేయిస్తే 3 వేలు పారితోషికం
ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3వేల పారితోషికం అందిస్తామని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు చెప్పారు. గోల్డెన్ అవర్ మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ప్రాముఖ్యత వివరిస్తూ మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పీహెచ్ సీలో ఈ ఔషధి, కుక్కకాటు, పాముకాటు ఇతరత్రా వ్యాధుల మందులు మూడు నెలలకు సరిపడేలా మందులు స్టాక్ ఉన్నాయా లేదా అని ఫార్మాసిస్టును ఆరా తీశారు. అవసరమైన మందులు తెప్పించి పెట్టాలని డీఏంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్ ను ఆదేశించారు.అక్కన్నపేట మండలంలో క్యాంపు నిర్వహించి పైసా ఖర్చు లేకుండా క్యాటారాక్ట్ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని, అలాగే 3 లక్షల ఖర్చుతో కూడిన మోకాలి చిప్ప ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామని మంత్రి చెప్పారు. 1300 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సతీష్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు చొరవతో అక్కన్నపేట మండలం రామవరం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పూర్వ వైభవం వచ్చిందని స్థానిక ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు పీహెచ్ సీలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కు బీపీ చెకప్ చేశారు.