ప్రజాసమస్యలపై చిత్తశుద్ది ఏదీ?
సమస్యలను విస్మరించిన ప్రభుత్వాలు: సిపిఐ
అనంతపురం,సెప్టెంబర్5(జనం సాక్షి): రాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని జిల్లా సిపిఐ కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న ప్రభుత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీమలో సమస్యలు పరిష్కరించడంలోనూ, అనంత కరువును ఆదుకోవడంలోనూ సర్కార్ విఫలమయ్యిందన్నారు. జిల్లాలో తీవ్ర కరువుతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షం లేక ఈ సారి వేసిన పంటలూ ఎండిపోయాయన్నారు. కేవలం నంద్యాల, కాకినాడ ఫలితాల్లో అధికార నేతలు మునిగి తేలుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చేవిషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హావిూలను గాలికి వదిలివేసి ప్రజలను మభ్యపెడుతూ రోజుకో కొత్త పల్లవిని ఎత్తుకుంటుందని అన్నారు. కరువు పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత కొనసాగుతోందని పేర్కొన్నారు. జిల్లాలోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, రుణమాఫీ మూడు విడతలు డబ్బులు ఒకే సారి జమ చేయాలని అన్నారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కరువు దృష్ట్యా అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఉపాధి హావిూ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా
చెల్లించాలని కోరారు. అదేవిధంగా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. నల్లధనం వెలికీతీత, అవినీతి నిర్మూలన, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షల జమ, రెండు కోట్ల ఉద్యోగాల కల్పన తదితర అంశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
——