ప్రజాస్వామ్యబద్ధంగా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలి
జూనియర్ సివిల్ జడ్జి వి. సాకేత్ మిత్ర హుజూర్ నగర్ అక్టోబర్ 2 (జనం సాక్షి): ఖైదీలు వారి ప్రవర్తనను మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని జూనియర్ సివిల్ జడ్జి వి. సాకేత్ మిత్ర అన్నారు. ఆదివారం గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం ను పురస్కరించుకొని హుజూర్ నగర్ పట్టణంలో సబ్ జైల్ లో జరిగిన ఖైదీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ పౌరులు శాంతిని కోల్పోయి అశాంతికి గురై సహనాన్ని కోల్పోవడం ద్వారా నేరాలకు పాల్పడి జైళ్ళ పాలవుతున్నారని, నేరాలకు పాల్పడిన వారిలో మానసిక పరివర్తన పెంపొందించడం కోసం జైళ్ళ శాఖ పనిచేస్తుందని అన్నారు. ఖైదీల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు చేపట్టటం సంతోషకరమన్నారు. ఖైదీలు ఈ సౌకర్యాలను, అవకాశాలను ఆసరాగా తీసుకొని పదే,పదే జైలుకు రావాలని కోరుకోవడం సరికాదన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న సమరయోధులను జైల్లో హింసించిన విధానం మర్చిపోలేనిదని ఆ రోజుల్లో జైళ్లలో బ్రిటిష్ పాలకులు అవలంబించిన విధానానికి, నేటి జైళ్ళల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జైళ్ళల్లో మగ్గటం మూలంగా వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఎంత మానసిక, శారీరక బాదన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. అనంతరం న్యాయమూర్తి ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ మంగ్త నాయక్, సి.ఐ. రామలింగారెడ్డి, ఎస్. ఐ. వెంకట్ రెడ్డి, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎం.ఎస్. రాఘవరావు, కొట్టు సురేష్ , జైల్ హెడ్ కానిస్టేబుల్ సీతయ్య, జైల్ సిబ్బంది, కోర్టు సిబ్బంది శ్యాం కుమార్, జానయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.