ప్రతాపరెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదు

గెలుస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు: ఎంపి

సిద్దిపేట,నవంబర్‌24(జ‌నంసాక్షి): గజ్వెల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డికి డిపాజిట్‌ కూడా రాదని, సీటు గెలిచి సోనియాకు బహుమతిగా ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గజ్‌ఎవల్‌లో ముందు డిపాజిట్‌ దక్కేందుకు కష్టపడాలని అన్నారు. సోనియా సభలో

ప్రతాపరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గజ్వేల్‌లో భారీ మెజారిటీ తీసుకొచ్చి చరిత్ర సృష్టిస్తామని అన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించాలని ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించామని ఎంపీ అన్నారు. యువత, మహిళలు తెరాస వైపే ఉన్నారన్నారు. మహాకూటమి వెంటిలేషన్‌పై ఉందని పేర్కొన్నారు. గజ్వేల్‌ నుంచి తొమ్మిదిసార్లు కాంగ్రెస్‌, నాలుగు సార్లు తెదేపా గెలిచినా అభివృద్ధే జరగలేదన్నారు. కేసీఆర్‌ కృషి వల్లే అభివృద్ధిలో గజ్వేల్‌ జాతీయస్థాయిలో గుర్తింపు సాధించిందన్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.సుస్థిరమైన పాలన తెరాసతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. తెరాస పార్టీ ఎన్నికల ప్రణాళికకు ఆకర్షితులై అనేకులు అధికార పార్టీలో చేరారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ధరావతు సొమ్ము గల్లంతు అయ్యేలా కారు గుర్తుకు ఓటు వేసి ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.