ప్రతిఒక్కరికి రక్షిత మంచినీరు అందించడమే ధ్యేయం

గుంటూరు, జూలై 17: రాజుపాలెం మండలంలోని కోట నెమలిపురి గ్రామ పరిధిలో ఉన్న నల్లబోతుకుంట సమీపాన 8 కోట్లతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి మంగళవారం శంకస్థాపన చేశారు. మొదటి విడతగా 4 కోట్లతో పథకాన్ని ప్రారంభించి దశల వారీగా పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం నుంచి మొత్తం ఏడు గ్రామాలకు మంచినీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటి పథకం నుంచి సరఫరా చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. దీనిలో భాగంగా అనుపాలెం, కోటనెమలిపురి, కొండమోడు, శ్రీనివాసనగర్‌, దేవరంపాడు, అంచులవారిపాలెం గ్రామాలకు మంచినీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రాహుల్‌సింగ్‌, డిఈ రామకృష్ణ, ఎఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.