ప్రతిపక్షాల కుట్రలను నమ్మకండి

– అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసింది కేసీఆరే

– విద్యాసాగర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలి

– కోరుట్ల ప్రచారంలో ఎంపీ కవిత

జగిత్యాల, నవంబర్‌14(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని, ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న కేసీఆర్‌ను ఒంటిరిగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ కూటమిగా వస్తున్నాయని, వారి కుట్రలను ఓటుతో తిప్పికొట్లాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. బుధవారం కోరుట్ల నియోజకవర్గంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో విద్యాసాగర్‌రావును మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కోరుట్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 11తర్వాత పెన్షన్లు రెట్టింపు చేస్తామన్నారు. రైతును ఏ ప్రభుత్వం ఆదుకోలేదన్న ఎంపీ రైతు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పంట పెట్టుబడి ఇస్తున్నట్లు వెల్లడించారు. రైతు రుణమాఫీ మాటను ఏపీ ఇప్పటికీ నిలుపుకోలేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు ఇంకా అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు నమ్మొద్దని కోరారు. కోరుట్లకు 100 పడకల ఆస్పత్రిని ఇదివరకే మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్నామని , జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, అధికారం కోసం ఏకమైన మహాకూటమిని, మతత్వ పార్టీ బీజేపీని తిరస్కరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మద్దతు టీఆర్‌ఎస్‌కు ఉందని మరోసారి అధికారంలోకి టీఆర్‌ఎస్‌ రావటం ఖాయమని, సీఎం కేసీఆర్‌ మరోసారి పాలన సాగించడం ఖాయమని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కొరుట్ల తెరాస అభ్యర్ధి విద్యాసాగర్‌రావు, ఇతర టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పాల్గొన్నారు.