ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల
ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు
అసంక్రమిత వ్యాధుల స్క్రీన్ చేసిన ఏకైక రాష్ట్రం మనదే
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,జూలై16(జనం సాక్షి ): ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కాబోతున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ సీట్లను పెద్ద సంఖ్యలో పెంచుతున్నట్లు చెప్పారు. చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వైద్య విద్య చదివేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. దేశంలో పెద్ద మొత్తంలో అసంక్రమిత వ్యాధులు ఎన్‌సీడీ స్క్రీనింగ్ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇప్పటివరకూ 1.34 కోట్ల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసి, దాదాపు 6 లక్షల షుగర్ పేషెంట్లను గుర్తించామన్నారు. వారందరికీ చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. బీపీ, షుగర్‌లాంటి అసంక్రమిత వ్యాధుల నివారణకు తెలంగాణ సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఐడియా క్లినిక్స్ డాక్టర్ సుధాకర్‌రావు ఆధ్వర్యంలో సోమాజిగూడ పార్క్ హోటల్‌లో శనివారం నిర్వహించిన డయాబెటిక్, ఎండో కైన్రాలజి రీసెర్చ్ అప్డేట్ `2022 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఇలాంటి సదస్సులద్వారా ఎన్నో అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు, ఒకరి నుంచి మరొకరు అనుభవాలు పంచుకునేందుకు మంచి అవకాశముంటుందన్నారు. చికిత్సలో వస్తున్న నూతన మార్పులు, టెక్నాలజీలు తెలుసుకోవచ్చని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. చికిత్సా విధానంలో రోజురోజుకూ అనేక మార్పులు వస్తున్నాయని, అనేక పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ప్రజలకు అధునాతనమైన వైద్య సేవలు అందించడం సాధ్యమవు తుందని తెలిపారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, చెడు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే రోగాలు వస్తున్నాయని, బీపీ, షుగర్‌లాంటి అసంక్రమిత వ్యాధులు వస్తున్నాయన్నారు. దీన్ని నియంత్రిం చేలా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకూ ఉన్న మూడంచెల అరోగ్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐదు మెడికల్ కాలేజీలుంటే ఇప్పుడు ఆ సంఖ్యను 33 కి పెంచుకుంటున్నామని తెలిపారు. అసంక్రమిత వ్యాధులపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యమ్రాలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు అవసరమైన మందులు అందిస్తున్నామని చెప్పారు. అవగాహన కల్పించడంతో పాటు ఎర్లీ స్క్రీనింగ్, ఎర్లీ ట్రీటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. బీపీ, షుగర్ నియంత్రణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడిరచారు. ప్రభుత్వమే పూర్తి ఉచితంగా మందుల కిట్స్ ఇస్తున్నదని చెప్పారు. ఏ మందులు ఎలా వేసుకోవాలో ఆ కిట్ లో స్పష్టంగా రాసి ఉంటుందని వివరించారు. మందులు ఇచ్చినా కొందరు అవగాహన లేక వాడడం లేదని, వారికి ఆశా కార్యకర్తలు కౌన్సిలింగ్ ఇచ్చి క్రమం తప్పకుండా మందులు వాడేలా చూస్తారన్నారు. 33 జిల్లాల్లో టీ డయాగ్నొస్టిక్స్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. 259 బస్తీ దవాఖానల ద్వారా పట్టణాల్లో ప్రజలకు వైద్యం చేరువైందన్నారు. వీటి సంఖ్యను త్వరలో 390కి పెంచుతున్నామని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్నాయన్నారు. ఇలా ప్రభుత్వం అనేక రకాలుగా ఎన్‌సీడీ వ్యాధులను గుర్తించి నియంత్రించే కార్యక్రమం అమలు చేస్తున్నదని తెలిపారు. ములుగు, సిరిసిల్లలో హెల్త్ ప్గ్రొªల్ పైలెట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందని, త్వరలో రాష్ట్రమంతటా
విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం, నడకలాంటివి అలవాటు చేసుకోవాలని, బాడీ మాస్ ఇండెక్స్ పరిమితిలో ఉండేలా చూసుకోవాలన్నారు. అధిక బరువు తగ్గించుకోవాలని సూచించారు. ఏటా కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలని, మందులు వాడాలన్నారు. జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయడమే కాకుండా, రాకుండా ఉండేలా చేసే అవగాహన కార్యక్రమాలు, ఉచిత పరీక్షల నిర్వహణ క్యాంపులు ఏర్పాటు చేయాలని సదస్సు నిర్వాహకులను కోరారు.