ప్రత్యర్థుల పనిపట్టే ప్లాన్‌లో మోడీ ద్వయం

శశిథరూర్‌పై చార్జీషీటుకు పురమాయిండంపై కాంగ్రెస్‌ ఆగ్రహం
తదుపరి టార్గెట్‌ తెలుగు చంద్రులేనా?
కెసిఆర్‌తో పెట్టుకునే ధైర్యం బిజెపి చేయగలదా?
న్యూఢిల్లీ,మే15(జ‌నం సాక్షి): అనూహ్యంగా కేంద్రమాజీమంత్రి శశిథరూర్‌పై ఛార్జిషీటుకు రంగం సిద్దం అయ్యింది. ఆయన భార్య సునందా పుస్కర్‌ ఆత్మహత్య కేసులో మెల్లగా థరూర్‌ను ఇరికించే ప్రయత్నం మొదలయ్యింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగానే మండిపడుతోంది. కర్నాటక ఎన్నికలు ముగిసిన తరవాత మెల్లగా ఈ కేసును దర్యాప్తులోకి తీసుకుని రావడం చూస్తుంటే కాంగ్రెస్‌ నేతలపై కొరడా ఝళిఫించేందుకు రంగం సిద్దం అయ్యిందని గుర్తించాలి. ఇప్పటికే చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరంపై కేసులు నమోదయ్యాయి. లాలూను జైలుకు పంపించారు. కావాలనే తమ పార్టీ నేతలను కేసుల్లో ఇరికిస్తున్నారని, దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సూర్జేవాలా ఆరోపించారు.  రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికై నరేంద్ర మోదీ, అమిత్‌ షా ద్వయం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని సూర్జేవాలా ఆరోపించారు. ఇదే  అభిప్రాయం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏర్పడింది. అవినీతి, నల్లధనం విషయంలో రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్‌ అవుతున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య క్యాంపు చేసి వచ్చిన రిసార్ట్‌పైన కూడా దాడులు చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీకి చెందినవారిపై మాత్రం ఈగ కూడా వాలడం లేదు. ఇప్పుడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అవినీతిపరుడిగా ముద్ర వేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబుపై విచారణ కోరతామని, చుక్కలు చూపిస్తామని స్థానిక బీజేపీ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా బాధ్యతలు చేప్టటిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే తరహాలో మాట్లాడారు.  దీనినిబట్టి చూస్తుంటే విపక్షనేతలను, విపక్ష పార్టీల సిఎంలను కూడా టార్గెట్‌ చేశారని అర్థం చేసుకోవాలి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయంలో కూడా ఒకరిద్దరు స్థానిక బీజేపీ నాయకులు ఇలాంటి ప్రకటనలే చేయడంతో ఆయనకు గట్టిఆగానే జవాబిచ్చారు. ఎన్నికలలో ఖర్చు చేయడానికి, పార్టీ నిర్వహణకు భారతీయ జనతా పార్టీకి నిధులు ఎలా వస్తున్నాయో తనకూ అలాగే వస్తున్నాయని కేసీఆర్‌ గట్టి కౌంటర్‌ ఇవ్వడంతో స్థానిక బీజేపీ నాయకుల నోళ్లు మూసుకున్నారు. గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్‌ షా రాష్ట్రానికి అంత ఇచ్చాం? ఇంత ఇచ్చాం అని చెప్పారు. దీనికి మండిపడ్డ కేసీఆర్‌, విలేకరుల సమావేశం పెట్టి మరీ అమిత్‌ షాను కడిగిపారేశారు. విూ ఇంటినుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. సమాఖ్య స్ఫూర్తి మేరకు రాస్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మాత్రమే చెల్లించారని ఎదురుదాడి చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సంజాయిషీ ఇచ్చి మరీ తెలంగాణ పొలిమేరలు దాటాలని అమిత్‌ షాను కేసీఆర్‌ నిలదీశారు. ఈ దెబ్బకు బిజెపి దెయ్యం వదిలిందని అంటారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం కేసీఆర్‌ మాట్లాడినంత గట్టిగా, ఆ ధోరణిలో మాట్లాడలేకపోతున్నారు. అయినా బిజెపి టార్గెట్‌లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ పాగా వేయాలంటే ముందు ఇక్కడ బలంగా ఉన్న నేతలను దెబ్బతీయాలి. అలా చయాలంటే అవినీతి ముద్ర వేయాలి. అందుకే కాబోలు తొలుత చంద్రబాబుపై ఈ అస్త్రం ఎక్కుపెట్టారు. అయితే బీజేపీ నాయకుల మాటలను బట్టి ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలని వారంతా కోరుకుంటున్నారు. చంద్రబాబు ఓడిపోవాలంటే ఆయనను అప్రతిష్ఠపాల్జేయాలి కనుక అందుకు ఏమి చేయాలో అవన్నీ చేసే అవకాశం ఉంది. కెసిఆర్‌ విషయంలో దూకుడు ప్రదర్శిస్తే అంతకు రెండింతలు కెసిఆర్‌ రెచ్చిపోయి బిజెపిని ప్రజల్లో ఎండట్టగలిగే సత్తా ఉంది. అందుకే ఆయన ఫెడరల్‌ ఫ్రంట్‌తో అప్పుడే చెక్‌ పెట్టే యత్నాలను ముమ్మరం చేశారు. ఇది బిజెపిని దెబ్బతీయడం ఖాయం.