ప్రధానమంత్రి ఉపాధి కల్పనకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం, జూలై 12: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద యూనిట్ల మంజూరుకు ఈ నెల 31లోగా దరఖాస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాదీగ్రామీణ పరిశ్రమల మండలి, జిల్లా పరిశ్రమల కేంద్రం, కాపీ పరిశ్రమల కమిషన్ ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరానికి 142 యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం అర్బన్ ప్రాంతానికి చెందిన 29 యూనిట్లు, మిగిలినవి గ్రామీణ ప్రాంతాల వారికి కేటాయించినట్లు తెలిపారు. సేవలు, ప్రాసెసింగ్, ఉత్పత్తి రంగంలో యూనిట్లు నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ పథకం కింద రాయితీలు లభిస్తాయని అన్నారు. ప్రాసెసింగ్, ఉత్పత్తి యూనిట్లను 25 లక్షలతో ఏర్పాటు చేస్తే గరిష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 25 శాతం రాయితీ లభిస్తుందన్నారు. సేవా రంగంలో 10 లక్షలతో ఏర్పాటు చేసే యూనిట్లకు రాయితీ ఇస్తామని ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఈ నెల 13 నుంచి పట్టణంలోని మున్సిపాల్టీ ఆవరణం, పెవెలియన్ గ్రౌండ్, గుట్టలబజారులోని మీ-సేవా కేంద్రాల్లో అందించాలని ఆయన అన్నారు.