ప్రధాని మోడీపై ఆమ్‌ ఆద్మీ మండిపాటు

చర్చించడానికి తీరిక లేదా అని ప్రశ్న

న్యూఢిల్లీ,జూన్‌19(జ‌నం సాక్షి ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఢిల్లీ అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనీ.. ప్రధాని మోదీ ఆయనతో చర్చలు జరపాల్సిందేనని డిమాండ్‌ చేసింది. ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ బైజల్‌ను కలుసుకునేందుకు ఎనిమిది రోజులుగా సీఎం కేజ్రివాల్‌ గవర్నర్‌ కార్యాలయం ముందే ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయిన ప్పటికీ లెప్టినెంట్‌ గవర్నర్‌ గానీ, కేంద్ర ప్రభుత్వంగానీ స్పందించకపోవడంపై ఆమాద్మీ మండిపడింది. కేజ్రివాల్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోదీకి సమయం లేదా? అంటూ ఆమాద్మీ నాయకుడు సంజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు. విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..’చర్చలు జరిపేందుకు ఢిల్లీ సీఎం సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ కేంద్రానికి మాత్రం తీరిక లేదు. ప్రధాని మోదీ పాకిస్తాన్‌తో మాట్లాడతారు.. కానీ మాతో మాత్రం మాట్లాడరు…’అని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు గవర్నర్‌ దర్శనం కోసం వారం రోజులకు పైగా ఓ ముఖ్యమంత్రి ఆందోళన చేస్తున్నా… కేంద్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గ్రావిూణ అభివృద్ధి మంత్రి గోపాల్‌ రాయ్‌తో కలిసి ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు.