ప్రధాని మోడీపై బలపడుతున్న అనుమానాలు
రఫెల్ యుద్ద విమానాలపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ తరవాత ప్రజలకు అర్థయ్యిందేవిూ లేదు. ఎవరి వాదనలు వారు వినిపించారు తప్ప అసలు విషయం చెప్పలేక పోయారు. అధికార బిజెపి ఎంతసేపు రాహుల్‌ను లేదా కాంగ్రెస్‌పై దాడి చేసిందే తప్ప ఒప్పందాలకు సంబంధించిన మౌళిక ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. అనిల్ అంబాని కంపెనీకి ఒప్పందాన్ని ఎవరు కట్టబెట్టారన్న సూటి ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే అంబానీ కంపెనీకి ఉన్న అర్హత ఏంటన్న దానికి సమాధానం రాలేదు. రఫేల్ పై జరుగుతున్న నిందాపూరిత ప్రచారాన్ని రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ తన ప్రసంగం ద్వారా ధ్వంసం చేశారని అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేసి ఆనందం వ్యక్తం చేయడం చూస్తుంటే ఎంత దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. నిర్మలాసీతారామన్‌ను అమాయకురాలని చేసి ఆమెచేత సమాధానం ఇప్పించడం ద్వారా ప్రధాని మోడీ తెరపై నుంచి తెలివిగా తప్పించుకున్నారు. నేరుగా సభకు వచ్చి సమాధానం చెప్పుకోలేని దురవస్థలో మోడీ ఉన్నారని అర్థం అయ్యింది. అంబానీ కంపెనీకి ఉన్న అర్హతుల, ఒప్పందం ఆ కంపెనీకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం ఇచ్చకోలేకపోయింది. అలాగే లోక్‌సభలో చేసిన ప్రసంగం ద్వారా నిజాలను దేశం దృష్టికి తీసుకొచ్చారంటూ నిర్మలా సీతారామన్‌ను ప్రధాని మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసించారు. అబద్ధాలు కొంతదూరం మాత్రమే ప్రయాణించ గలవు. నిజాలు దట్టించిన అద్భుత ఉపన్యాసంతో కాంగ్రెస్ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ధ్వంసం చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ బాగా మాట్లాడి ఉండవచ్చు. రాహుల్‌ను ఎండగట్టి ఉండవచ్చు. కానీ ఈ వ్యవహారం రాహుల్‌కు సంబంధించినది కాదు. యుద్దవిమానాలను కొనుగోలు చేయడంలో అంబానీ కంపెనీకి కట్టబెట్టడంలో ఎవరు రెకమెండ్ చేశారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక పోయారు.రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై దాడిని ముమ్మరం చేసింది కూడా ఇదే విషయంలోనే. అంబాని కంపెనీకి ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా శుక్రవారం పార్లమెంటు లోపలా, బయటా విమర్శల వర్షాన్ని కురిపించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు, ఇతర సీనియర్ నేతలు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై క్రిమినల్ దర్యాప్తు జరిపించి, బాధ్యులైన వారిని శిక్షిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. దీనిపై విచారణ జరిపే అధికారం తనకు లేదని మాత్రమే సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని అన్నారు. దర్యాప్తు జరపకూడదని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తాము అడిగే ప్రశ్నలకు రక్షణ మంత్రి సమాధానాలు ఇస్తున్నారే తప్ప, ప్రధాని పెదవి విప్పడం లేదని విమర్శించారు. రాహుల్ అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగినంత మాత్రాన ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాలకు ఆమోదం లభించినట్లు కాదు. లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ రఫేల్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ ప్రధాని మోదీపైనే తప్ప, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్‌లపై చేసినవి కావని స్పష్టం చేశారు. వారికి దీంట్లో సంబంధం లేదని చెప్పారు. నిర్మలా సీతారామన్ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చినా తాను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మద్దతు ఇస్తున్నందున మోదీపై విచారణ జరగాలని పేర్కొన్నారు. రఫేల్ వ్యవహారంపై ప్రధాని మోదీయే స్వయంగా సమాధానం చెప్పాలన్న డిమాండును మాత్రం పట్టించుకోలేదు. లేని కాగ్ నివేదికను
చూపించి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారని చేసిన విమర్శలకు సమాధానం రాలేదు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌కు ఆఫ్‌సెట్ కాంట్రాక్టు ఇవ్వాలని ఎవరు నిర్ణయించారన్న సూటి ప్రశ్నకు సమాధానం రాలేదు. అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇస్తేనే ఒప్పందం కుదురుతుందని స్వయంగా నరేంద్ర మోదీయే చెప్పారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశారు… దీనిపై స్పందన ఏమిటి? అన్న రాహుల్ ప్రశ్నలకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వలేక పోయారు. ఇక్కడే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ విషయం ఒక్క ప్రధాని మోడీకి మాత్రమే తెలుసు. ఎరిక్‌సన్ కంపెనీకి చెల్లించా ల్సిన డబ్బు చెల్లించకుండా సుప్రీం ధిక్కరణ ఎదుర్కొంటున్న కంపెనీకి రక్షణ ఒప్పంద కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారన్న మౌలికమైన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేయడం ద్వారా మరిన్న అనుమానా లకు తావిచ్చారు. మామూళ్లు దక్కనందునే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఒప్పందాన్ని ఖరారు చేయలేదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణల్లో పసలేదు. ఇది బోఫోర్స్‌లా కుంభకోణం కాదని, దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయమని అన్నారు తప్ప, అనిల్ అంబానికి ఎందుకు కట్టబెట్టారో చెప్పలేకపోయారు. నిజానికి ఈ విషయంలో నిర్మలా సీతారామన్‌కు కూడా విషయాలు తెలియవని అర్థం అయిపోయింది. తనకు, ప్రధాని మోదీకి కుటుంబ వారసత్వాలు లేవని, తమను అబద్ధాలకోర్లు, దొంగలు అనే హక్కు ఎవరికీ లేదని అన్నంత మాత్రాన ఒప్పందాల్లో జరిగిన అక్రమాలు సక్రమాలు కావు. సమాధానం కూడా ఇది కాదు. రఫేల్ వ్యవహారంపై లోక్‌సభలో రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ ఇచ్చిన వివరణతో అపవాదులు తొలగి పోయాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యా నించడం మరీ దారుణం కాక మరోటి కాదు. లోక్‌సభలో చర్చ ద్వారా అనీల్ అంబానికి డీల్ కట్టబెట్టడంపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అలాగే మోడీ నిజాయితీపై మరింతగా అనుమానాలు పెరిగాయి.