ప్రపంచం ఇక మీ గుప్పిట్లో..

5

– రిలయన్స్‌ జియో విప్లవం

– సేవలకు శ్రీకారం

– వార్షిక సమావేశంలో ముఖేష్‌ అంబానీ వెల్లడి

ముంబై,సెప్టెంబర్‌ 1(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్‌ ఇండియా కలను రిలయన్స్‌ జియో సాకారం చేస్తుందని ఆ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముకేశ్‌ అంబానీ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో వినియోగదారులకు ‘ఫ్రీ వెల్‌కం ఆఫర్‌’ ప్రకటించారు. సెప్టెంబరు 5 నుంచి డిసెంబరు 31వరకు ఈ ఆఫర్‌ ఉంటుంది. ఈ నాలుగు నెలలు అన్ని సర్వీసులు ఉచితం. ఆ తర్వాత దాదాపు పది టారిఫ్‌ ప్లాన్స్‌ను ప్రకటించనున్నట్లు చెప్పారు. గురువారం రిలయన్స్‌ జియో దేశవ్యాప్త సేవలను ఆయన ప్రారంభించారు. రిలయన్స్‌ జియో సంస్థ భారీ టార్గెట్‌ను పెట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే 4జీ సేవలను 10 కోట్ల మంది కస్టమర్లకు అందించనున్నట్లు ముఖేశ్‌ అంబానీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సేవలను శరవేగంగా విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో 90 శాతం వరకు 4జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మొత్తం 18000 నగరాలు, రెండు లక్షల గ్రామాల్లో 4జీ సేవలు కవర్‌ అవుతాయన్నారు. నాలుగు నెలల పాటు జియో డేటా సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నా ముఖేశ్‌ ఇవాళ అనేక అంశాలను వెల్లడించారు. సుమారు గంట పాటు మాట్లాడిన అంబానీ తన తండ్రి ధీరూభాయ్‌ అంబానీ కాంక్షించిన రిలయన్స్‌ సంస్థ ఉద్దేశం ఇదేనన్నారు. షేర్‌¬ల్డర్లుకు రివార్డులు అందించేందుకు రిలయన్స్‌ బోర్డు సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు. తమకు చెందిన పెట్రో కెమికల్‌, ర్గి/ల్గ/నింగ్‌ వ్యాపారం 50 శాతం అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తోందన్నారు. అత్యున్నత క్రీడా సంస్థ ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఐఓసీ)కు నీత అంబానీ ఎన్నిక కావడం సంతోషకరమని ముఖేశ్‌ తెలిపారు. ప్రతి నెలా 12 లక్షల హ్యాండ్‌ సెట్లను అమ్మనున్నట్లు ఆయన చెప్పారు. పోటీదారులు తమ సేవలకు అడ్డుపడరాదని ఆయన కోరారు.ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే టెలికామ్‌ షేర్లు పతనమయ్యాయి. ఐడియా షేర్లలో 8శాతం నష్టపోయి, బీఎస్‌ఈలో షేర్‌ వాల్యూ 86.10 రూపాయలకు పడిపోయింది. ఇక ఎయిర్‌టెల్‌ విషయానికొస్తే 5.5 శాతం నష్టపోయి, షేర్‌ వాల్యూ 313రూపాయలకు చేరుకుంది. జియో ప్రకటించిన ఆఫర్లును తట్టుకుని మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను కాపాడుకునేందుకు ఇతర టెలికాం కంపెనీలు సమాలోచనలు జరుపు తున్నాయి. రిలయన్స్‌ జియోతో పోటీగా ఆఫర్లను ప్రకటించాలని… అందుకు అయ్యే భారంపై ఆయా కంపెనీల ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్‌లో డేటా రేట్లు భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  లిమిటెడ్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ  జియో వినియోగదారులకు ఉచిత వాయిస్‌ కాలింగ్‌, రూ.50కే 1జీబీ డేటాతో ఆఫర్లు ప్రకటించడంతో ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల షేర్లపై ప్రభావం పడింది.రిలయన్స్‌ జియో దెబ్బకు ఈరోజు ప్రముఖ టెలికాం సంస్థలు ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లు కుదేలయ్యాయి.  ఐడియా సెల్యులర్‌ షేర్లు ఏకంగా 9 శాతం పడిపోయాయి. షేరు విలువ రూ.85తో బీఎస్‌ఈలో 52వారాల కనిష్ఠానికి పడిపోయింది. భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు కూడా 8.99శాతం పడిపోయాయి.