ప్రపంచం మనవైపే చూస్తోంది
– మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు
హైదరాబాద్,సెప్టెంబర్ 1(జనంసాక్షి): ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారత్ మాత్రమేనని, అందుకే ప్రపంచం మొత్తం మనవైపే చూస్తోందని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. యువత ముందుంటేనే దేశం అడుగు ముందుకు పడుతుందన్నారు. యువత దేవానికి అసెట్ అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా 30వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో చెరువుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని.. మంత్రి హరీశ్‌రావు పనితీరు బాగుందని కితాబిచ్చారు. 2012 వరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు భారీగా ఉండేవని.. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విద్యుత్ సరఫరాలో వచ్చిన గణనీయమైన మార్పులతో తెలంగాణ రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వెర్టర్లకు గిరాకీ తగ్గిందన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గోదావరి జలాల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమలకు 10శాతం నీటిని కేటాయించనున్నట్లు తెలిపారు.