ప్రపంచ కప్‌లో తొలి విజయం నమోదు చేసుకున్న న్యూజిలాండ్
క్రీస్ట్‌చర్చ్,ఫిబ్రవరి14(ఆర్‌ఎన్‌ఎ): క్రికెట్ ప్రపంచకప్-2015ను ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు విజయంతో ఆరంభించింది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కివీస్ 98 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ధాటిగా ఆడి బారీ లక్ష్యాన్ని ముందుంచిన న్యూజిలాండ్ తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 331 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక 46.1 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది. లంక ఎదుట 332 పరుగుల భారీ లక్ష్యం ఉండటంతో లంక ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. ఆచితూచి ఆడుతూ.. పరుగులు రాబట్టారు. ఓపెనర్ తిరిమన్నె, దిల్షాన్‌లు సంయమనంతో ఆడారు. క్రీజులో కుదురుకున్న వీరి జోడిని వెటోరి విడదీశాడు. 24 పరుగులు చేసి దిల్షాన్ ఔట్ అవడంతో 67 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వచ్చిన సంగక్కరతో కలిసి తిరిమన్నె నిలకడగా ఆడాడు. అయితే జట్టు స్కోరు 124 వద్ద ఉండగా, 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తిరిమన్నెను బోల్ట్ బౌల్డ్ చేశాడు. కొద్దిసేపటికే జయవర్ధనె 0(3), సంగక్కర 39(48) ఔట్ కావడంతో లంక ఒడిదొడుకులకు లోనైంది. ఈ దశలో కెప్టెన్ మాథల్యిస్ కొద్దిసేపు కివీస్ బౌలర్లను ప్రతిఘటించాడు. ఓ పక్క కరుణరతనె 14(32), మెండిస్ 4(5), కులశేఖర10(32) వికెట్లు పడుతున్నా.. తాను సంయమనంతో ఆడాడు. 80 బంతుల్లో 46 పరుగులు చేసిన మాథల్యిస్‌ను సౌథీ ఔట్ చేయడంతో లంక మరింత కష్టాల్లో పడింది. అయితే హెరాత్ కొద్దిసేపు న్యూజిలాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 41 బంతులు ఎదుర్కొన్న అతను 13 పరుగులు చేశాడు. చివరకు అండర్సన్ బౌలింగ్‌లో మిల్నేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లంక పరాజయం, న్యూజిలాండ్ ఘనవిజయం ఖరారైపోయింది. కివీస్ బౌలర్లలో సౌథీ, బోల్ట్, మిల్నే, వెటోరి, అండర్సన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. 11వ ప్రపంచకప్‌లో భాగంగా కైస్ట్ర్ చర్చ్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తొలుత 332 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. మొదట కెప్టెన్ మెక్‌కలమ్(49 బంతుల్లో 65) అద్భుంగా రాణించగా, చివరిలో అండర్సన్ (46 బంతుల్లో 75) చెలరేగి ఆడటంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ 49(62), బ్రెండన్ మెక్‌కలమ్ 65(49) అద్భుత శుభారంభాన్ని ఇచ్చారు. గప్తిల్ నిలకడగా ఆడుతుంటే.. మెక్‌కల్లమ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. టోర్నీలో తొలి, ఫోర్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డును నమోదు చేశాడు. ఈ జోడీని విడదీయడానికి లంక బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓవర్‌కు 6 పరుగుల రన్‌రేట్‌ను వీరిద్దరూ కొనసాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా 8వ ఓవర్‌లో 23 పరుగులను దండుకున్నారు. దూకుడుగా ఆడుతున్న వీరి జోడిని హెరాత్ విడదీశాడు. ఈ దశలోనే మెక్‌కలమ్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 49 బంతుల్లో 65 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న మెక్‌కల్లమ్ భారీ సిక్స్‌కు యత్నించగా బౌండరీ లైన్ వద్ద అతని క్యాచ్‌ను మెండిస్ అద్భుతంగా ఒడిసి పట్టాడు. దీంతో 111 పరుగుల తొలి వికెట్
భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వచ్చిన క్రీజులోకి వచ్చిన విలియమ్సన్… మెక్‌కల్లమ్ దూకుడును అందిపుచ్చుకుని పరుగుల వేట కొనసాగించాడు. ఈ దశలో 49 పరుగులతో నిలకడగా ఆడుతున్న గప్తిల్‌ను లక్మల్ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్‌టేలర్‌తో కలిసి విలియమ్సన్ సంయమనంతో ఆడాడు. జట్టు స్కోరు 193 వద్ద ఉండగా.. కివీస్ వెంటనే వెంటనే విలియమ్సన్(57), రాస్ టేలర్(14) వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇలియట్, అండర్సన్‌లు బంతిని ఎడాపెడా బౌండరీకి తరలిస్తూ పరుగులురాబట్టారు. 29 పరుగులు చేసిన ఇలియట్… లక్మల్ బౌలింగ్‌లో తిరిమన్నెకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం రోంచితో కలిసి అండర్సన్ దూకుడు ఆడుతూ జట్టు స్కోరు 300 దాటించడమే కాకుండా అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో చెలరేగి ఆడిన అండర్సన్ 36 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని భారీ షాట్ ఆడేందుకు యత్నించిన అండర్సన్ కులశేఖర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంక బౌలర్లలో మెండిస్, లక్మల్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, కులశేఖర, హెరాత్‌లకు చెరో వికెట్ లభించింది.