ప్రపంచ మెగా నగరాల్లో మన హైదరాబాద్‌

3

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి):హైదరాబాద్‌ అంటే ఇప్పటిదాకా 400 ఏళ్ల చారిత్రక నగరం. భిన్నమతాల, విభిన్న సంస్కృతుల కలబోత. గంగా జమునా తెహజీబ్‌ కు నిలువెత్తు నిదర్శనం. ఇక ముందు హైదరాబాద్‌ అంటే- ఒక బ్రాండ్‌. దీర్ఘకాలిక విజన్‌ తో సీఎం కేసీఆర్‌ భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా, లైఫ్‌ సెన్సెస్‌, ఎంటర్‌ టైన్‌ మెంట్‌, ఇండస్ట్రియల్‌, స్టార్టప్‌ హబ్‌ గా ఎదుగుతోంది. 2030 నాటికి వరల్డ్‌ మెగా సిటీల్లో ఒకటిగా మన నగరం అవతరించబోతోంది. సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం 2016 ప్రపంచ మెగా సిటీల జాబితాను తాజాగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌ కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు చోటు దక్కింది. 2030 నాటికి కోటి పైచిలుకు జనాభాతో హైదరాబాద్‌ కూడా మెగా సిటీల జాబితాలో చేరుతుందని నివేదిక వెల్లడించింది. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ నగరం కూడా లిస్టులో ఉంటుందని పేర్కొంది. మన దేశంలో ప్రస్తుతం కోటి చొప్పున జనాభాతో ఐదు మెగా సిటీలు ఉన్నాయి. 2030 నాటికి ఈ మెగా సిటీల సంఖ్యకు ఏడుకు చేరుతుంది. వరల్డ్‌ వైడ్‌ గా చూసుకుంటే.. 41 నగరాలు మెగా సిటీలుగా రూపాంతరం చెందనున్నాయి. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీ జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో నగరంగా అవతరిస్తుందని ఐరాస నివేదిక వెల్లడించింది.నిజానికి హైదరాబాద్‌ ను మెగా సిటీగా తయారు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పట్నుంచే బలమైన పునాదులు వేస్తోంది. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ బహుముఖ ప్రణాళికలు రూపొందించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా లాంఛ్‌ చేసిన టీఎస్‌ ఐపాస్‌ తో నగరానికి పెట్టుబడుల వరద పారుతోంది. దేశ విదేశీ కంపెనీలు భాగ్యనగరానికి క్యూ కడుతున్నాయి. ఐటీ, స్టార్టప్‌ పాలసీలు పరిశ్రమలకు వరంగా మారాయి. అమెజాన్‌, గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఏరికోరి సిటీలో ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నాయి. స్టార్టప్‌ సంస్థలకు ఆక్సిజన్‌ అందించే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ టీ-హబ్‌ ను సర్కార్‌ హైదరాబాద్‌ లో ప్రారంభించింది. అందులో ఇప్పటికే వేలాది స్టార్టప్‌ లు ఊపిరి పోసుకున్నాయి. 30కి పైగా ఐటీ కంపెనీలు రెక్కలు గట్టుకుని వచ్చి భాగ్యనగరంలో వాలిపోయాయి. హైదరాబాద్‌ లో ఐటీ రంగానికి ప్రభుత్వం చక్కని మౌలిక సదుపాయాలు కల్పించింది. దేశంలోనే స్టార్టప్ల డెస్టినేషన్‌ గా, ఇన్నోవేషన్‌ సెంటర్గా హైదరాబాద్‌ ఎదుగుతోందనడానికి- ఈ మధ్యే నగరంలో జరిగిన ఆగస్ట్‌ ఫెస్ట్‌ నిదర్శనం! ఇవికాకుండా ఆకాశ హర్మ్యాలు, మల్టీ లెవెల్‌ ఫ్లై ఓవర్లు, సిగ్నల్‌ ఫ్రీ ట్రాఫిక్‌ సిస్టం, ప్లాస్టిక్‌ రోడ్లు- ఇలా ఒక మెగా సిటీకి ఉండాల్సిన సదుపాయాలన్నీ తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తోంది.