ప్రపంచ వ్యవసాయ సదస్సును విజయవంతం చేస్తాం


అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రైతులకు ప్రోత్సాహం

మార్కెటింగ్‌ మెళకువలు, ఉత్సాదకత పెంపుపై అవగాహన

సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌ 24 : వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు విజయవంతానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 2013 నవంబర్‌ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నాలుగురోజులపాటు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ వ్యవసాయ సదస్సు సన్నాహక సమావేశాన్ని ఆయన శనివారంనాడు జూబ్లీహాల్‌లో ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రపంచ వ్యవసాయ ఫోరం చైర్మన్‌ కెనెత్‌ బెకర్‌, ఫోరం సలహామండలి చైర్మన్‌, న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జేమ్స్‌ బీ. బోల్గర్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యవసాయ సదస్సు రాష్ట్రంలో నిర్వహించేందుకు అవకాశం దక్కడం ఆనందంగా ఉందని, ఈ సదావకాశం కల్పించినందుకు  వ్యవసాయ వేదికకు ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జీవవైవిధ్య సదస్సు మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ఈ స్ఫూర్తితో ప్రపంచ వ్యవసాయ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సదస్సులో 175దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం ముందడుగులో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఐదేళ్ళలో లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయని ఆయన తెలిపారు.  20లక్షల ఎకరాలలో ఇప్పటికే సాగునీరు అందుతుందని, మరో 30లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. వ్యవసాయంతోపాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపారు. పాడిపరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, మత్స్యపరిశ్రమ తదితర అనుబంధ రంగాల ద్వారా రైతులకు ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడిన వారు ఉపాధి కోసం ఇతర రంగాలకు మళ్ళకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కృషి జరగాలన్నారు. అందుకు అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చలు జరగాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, లాభనష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు. మార్కెటింగ్‌ మెళకువలు, పంట ఉత్సాదకత పెరిగేలా రైతులను చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రపంచ వ్యవసాయ సదస్సు విజయవంతం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. నవంబర్‌లో జరిగే ప్రపంచ వ్యవసాయ సదస్సు నేపథ్యంలో శనివారం జరుగుతున్న సన్నాహాక సదస్సులో వ్యవసాయానికి సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలోని వ్యవసాయ రంగ పరిస్థితులు, వాతావరణ, వ్యవసాయంలో ఆధునిక విధానం, బీటి వ్యవసాయ పద్దతులు తదితర అంశాలపై వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను ఈ సదస్సులో వెల్లడిస్తారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు నుంచి ఆయా రాష్ట్రాలు ఆశిస్తున్న ఫలితాలపై కూడా ఈ సదస్సులో చర్చిస్తారు.