ప్రభుత్వంతో చర్చలు విఫలం ఉధృతమైన జూడాల సమ్మె
అత్యవసర సేవలు నిలిపివేత
సమ్మెబాట వీడాలని ప్రభుత్వ హుకూం
ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి): జూనియర్ డాక్టర్ల సమ్మె ఉద్ధృతమైంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ జూడాలు మంగళవారం నుంచి ఆందోళనను మరింత తీవ్రవతరం చేశారు. సోమవారం రెండు ఆస్పత్రుల్లోనే అత్యవసర సేవలు నిలిపివేసిన జూనియర్ వైద్యులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లోనూ ఎమర్జెన్సీ సేవలు నిలిపివేశారు. నాలుగో రోజు కూడా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం జూడాలతో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో జూడాలు సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతామని సర్కారు అంటుంటే, తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని జూడాలు భీష్మించారు. దీంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు వైద్య సేవలు నిలిచిపోయాయి. అటు విజయవాడలోని సిద్ధార్థ, కాకినాడలోని రంగరాయ, కర్నూలులోని బాధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ, సాధారణ సేవలు స్తంభించాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో అన్ని వైద్యసేవలు నిలిచిపోగా, మంగళవారం నుంచి గుంటూరు, ఆంధ్ర మెడికల్ కాలేజీ, తిరుపతి రుయా సహా వైద్య కళాశాలల విద్యార్థులూ విధులు బహిష్కరించారు. ఎమర్జెన్సీ సేవలూ నిలిపివేశారు. జూడాల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర వైద్య సేవలు అందక వెనుదిరిగారు. ఓవైపు, వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు విస్తరిస్తున్న నేపథ్యంలో.. వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరోవైపు, ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సీనియర్ వైద్యులు, ఇతర ప్రత్యామ్న సిబ్బందిని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించలేదు. దీంతో వైద్యం అందక, ప్రత్యామ్నయ ఏర్పాట్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మూడు నెలల క్రితం సమ్మె చేసినప్పుడు 12 డిమాండ్లు నెరవేరుస్తామని హావిూ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క హావిూ నెరవేర్చక లేదని జూడాలు మండిపడుతున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో వైద్య సేవలపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేయాలని, హావిూలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఈ మేరకు 72 గంటల ముందే సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా, ప్రభుత్వం స్పందించ లేదు. దీంతో జూనియర్ వైద్యులు సమ్మె బాట పట్టారు. నాలుగు రోజులుగా సాధారణ వైద్య సేవలు నిలిపేసిన జూడాలు.. మంగళవారం నుంచి అత్యవసర సేవలనూ నిలిపేశారు.
ఎస్మా తప్పదు..
జూడాలు సమ్మె బాట వీడి విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరింది. లేదంటే, ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. జూనియర్ డాక్టర్ల సమస్యలు నెలరోజుల్లో పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిశోర్ హావిూ ఇచ్చారు. జూడాలు వెంటనే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. వారితో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమన్నారు. జూనియర్ డాక్టర్లు ఏడాది పాటు గ్రావిూణ ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎంసీఐ నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. జూడాలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించేందుకు జూడాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అన్ని మార్గాలు విఫలమైతే ఎస్మా ప్రయోగం తప్పనిసరి అని తెలిపారు.