ప్రభుత్వం ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ చూపడం లేదని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. శనివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను డిసెంబర్‌ 19లోగా పరిష్కరించకపోతే రాష్ట్రంలో పరిపాలనను స్తంభింపచేస్తామని ఆయన పేర్కొన్నారు. పదో పిఆర్‌సీని అమలు చేయడానికి ప్రభుత్వం అడ్డుపడుతుందని అన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డులకు ప్రభుత్వం కొరివి పెడుతుందని విమర్శించారు. హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో తెలంగాణ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సకల జనుల సమ్మెను ప్రత్యేక సెలవుగా పరిగణించాలని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో టీఎన్జీవోస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను ఉద్యోగులు బలపరిచి గెలిపించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో రాష్ట్రకార్యదర్శి రవీందర్‌, జిల్లా అధ్యక్షుడు గంగారాం, కార్యదర్శి కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు