*ప్రభుత్వమే విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లించాలి ఆర్ కృష్ణయ్య*

కోదాడ అక్టోబర్ 22(జనం సాక్షి)
 విద్యార్థులు హక్కుల కోసం ప్రభుత్వం పై ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీసీ విద్యార్థి సింహ గర్జన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్ షిప్ 5500 నుండి పెరిగిన ధరల ప్రకారం 20 వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు 3200 కోట్లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అడుగడుగునా అన్యాయం చేస్తున్నాయని అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్రం ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలకు తప్ప బీసీ కులాలకు రాజకీయ రంగంలో సముచిత వాటా దక్కడం లేదన్నారు. బీసీలను అగ్రవర్ణాలు అరకొరగా పదవులతోనే సరిపెడుతున్నాయని కేవలం ఓటు బ్యాంకింగ్ గానే వాడుకుంటున్నారని అన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా బీసీలు అంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ సందర్భంగా వారిని గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, ప్రముఖ విద్యా వేత్త పందిరి నాగిరెడ్డి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ ,ఎంఎస్పి నాయకులు ఏపూరి రాజు మాదిగ, బీఎస్పీ నాయకులు గుండెపంగు రమేష్, మైనార్టీ నాయకులు షేక్ భాజాన్, గిరిజన నాయకులు బర్మావత్ సీతారాంసింగ్ ,ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు భూక్య రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.